తెరాసకు ఈసారి ఓటమి తప్పదా?

సార్వత్రిక ఎన్నికల తర్వాత.. తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రంలో జరిగిన దాదాపుగా అన్ని ఎన్నికల్లోనూ విజయాలు నమోదు చేస్తూ వచ్చింది. మధ్యలో వచ్చే ఎన్నికల్లో విజయం అధికార పార్టీకి కొంత సునాయాసమైన విషయమే అయినా.. మొత్తానికి ఎన్నికల తర్వాత.. అన్నీ గులాబీ పార్టీనే గెలిచింది. చివరికి సింగరేణి ఎన్నికలను కూడా వారే సొంతం చేసుకున్నారు.

ఆ పార్టీ ఖాతాలో ఇన్ని విజయాల తర్వాత.. ఇటీవల ఏపీలో నంద్యాల బైపోల్ ఫలితాలు చూసిన తర్వాత.. తన ప్రభుత్వానికి కూడా ఆదరణ పుష్కలంగా ఉన్నదని చాటుకోవడానికి కేసీఆర్ కూడా ఒక బైపోల్ కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం మొదలైంది. అయితే ఇప్పుడు అనుకోకుండా ఉపఎన్నిక ముంచుకు వచ్చింది. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాజీనామా చేసేయడంతో.. అక్కడ ఎన్నిక జరగాల్సిందే. అయితే ఈ ఎన్నిక మాత్రం కేసీఆర్ ఊహించినట్లుగా కాకుండా, తెరాసకు పరాజయభారాన్ని కట్టబెడుతుందేమో అనే ఊహాగానాలు రాజకీయవర్గాల్లో సాగుతున్నాయి.

రేవంత్ రెడ్డి తెలుగుదేశాన్ని వీడి, కాంగ్రెసులోకి వెళ్లబోతున్నారనే ప్రచారం వచ్చిన నాటినుంచి తెరాస తన శైలిలో మైండ్ గేమ్ ప్రారంభించింది. కొడంగల్ నియోజకవర్గంలోని కొందరు తెదేపా నాయకులను తమ పార్టీలోకి చేర్చుకోవడం ప్రారంభించింది. తెదేపాను వీడితే.. రేవంత్ కు సొంత నియోజకవర్గంలో కూడా దిక్కులేదనే సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నించింది. అయితే రేవంత్ మాత్రం బెదరలేదు. తాను రాజీనామా చేసేసి, మళ్లీ ఇక్కడినుంచే పోటీచేస్తానంటూ ప్రజలకు మాట ఇచ్చారు.

అయితే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి రేవంత్ రెడ్డి బలమైన నాయకుడు అని ఒప్పుకోవాల్సిందే. పైగా ఆయన బలం తెలుగుదేశం పుణ్యమాని దక్కింది కూడా కాదు. ఇండిపెండెంటు గానే తాను అక్కడ తన బలాన్ని నిరూపించుకున్న తర్వాతే రేవంత్ తెదేపాలోకి వచ్చారు. తెదేపా నుంచి బయటకు వచ్చినంతమాత్రాన ఆయన బలం మాసిపోయేది కూడా కాదు. అందుకే ఆయన తన నియోజకవర్గంపై మార్పులేదని అంటున్నారు. ఇక్కడ ఉపఎన్నిక అనివార్యం అయితే.. తెరాస ఓటమిని చవిచూడాల్సి రావచ్చుననే ఊహాగానాలే ఎక్కువగా ఉన్నాయి.

ఒక ఉపఎన్నికను తామే సృష్టించి.. తమ బలాన్ని చాటుకోవడానికి వాడుకోవాలని.. కేసీఆర్ దళం స్కెచ్ వేస్తే.. ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. అనుకోకుండా రాబోతున్న ఉప ఎన్నికలో ప్రత్యర్థులకే బలం ఉన్నట్లుగా ఫలితం తేలినా ఆశ్చర్యం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ సంక్షోభాన్ని గులాబీ బాస్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కొడంగల్ లో విజయం సాధించాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.