తె-తెదేపాకు బాబు హుకుం : కీప్ క్వయిట్!

తెలంగాణలో తెలుగుదేశం రాజకీయాలు తాటాకు మంటలాగా రెండు రోజులు చిటపటలాడి.. ఆ తర్వాత చల్లారినట్లుగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఢిల్లీలో రాహుల్ ను కలిశాడనే వార్తలు వచ్చిన నాటినుంచి తెలంగాణ తెదేపా రాజకీయాలు వేడెక్కాయి. హాట్ హాట్ చర్చలు సాగాయి. రచ్చలు జరిగాయి. పార్టీలోని ముఠాలు బయటపడ్డాయి. చంద్రబాబు విదేశీయాత్రలో ఉండగానే.. ఇన్ని గందరగోళాలు సాగిపోయాయి. వీటికి ఒక ఫుల్ స్టాప్ పెడుతూ.. రేవంత్ రెడ్డి తెదేపాకు రాజీనామా చేసి.. కాంగ్రెసు తీర్థం పుచ్చుకున్నారు.

ఆ తర్వాత చంద్రబాబు రెండు మూడుసార్లు తె- తెదేపా నాయకులతో సమావేశం కావడం వారికి దిశానిర్దేశం చేయడం, కార్యకర్తల సమావేశంలో వారికి భరోసా ఇవ్వడం వంటివి కూడా జరిగాయి. ఆ తర్వాత.. కొన్ని రోజులు రేవంత్ ను ఓడిస్తాం అని, రేవంత్ పోవడం వల్ల తమ పార్టీకేమీ నష్టంలేదని కొన్ని ప్రకటనలు వచ్చాయి. అయితే.. ఆ తర్వాత మొత్తం వాతావరణం చల్లబడింది. ఇపుడు చూస్తే.. తెలంగాణ తెలుగుదేశం ఎక్కడ చప్పుడు చేయడంలేదు.

రేవంత్ వెళ్లిపోయిన తర్వాత.. ఆయనను తిట్టిపోయడంలో.. ఆయన సంగతి తేలుస్తాం అంటూ హెచ్చరికలు చేయడంలో కొన్ని రోజుల పాటూ తెదేపా నాయకులు దూకుడు ప్రదర్శించిన తర్వాత సైలెంట్ అయిపోయారు. అయితే ఇదంతా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సూచన మేరకే జరిగినట్లుగా తెలుస్తోంది.

పార్టీకి రాజీనామా చేస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి చాలా హుందాగా వ్యవహరించారు. సాధారణంగా పార్టీని వీడిపోతున్న వ్యక్తులు ఆ పార్టీ మీద వీలైనంత బురద చల్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ.. రేవంత్ అలాంటి పనులేమీ చేయలేదు. పైగా అధినేత చంద్రబాబునాయుడును, ఆయన పాలనను విపరీతంగా కీర్తించారు. ఆయన నాయకత్వంలో పార్టీలో పనిచేయడం అదృష్టంగా అభివర్ణించారు. అయితే ఇతరత్రా కొన్ని కారణాల వల్ల మాత్రమే పార్టీని వీడిపోతున్నట్లుగా చెప్పుకున్నారు.

తన మీద ప్రదర్శించిన భక్తికి మురిసిపోవడం వల్ల మాత్రమే కాకపోవచ్చు గానీ.. ఇంకా అనేక అంశాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబునాయుడు రేవంత్ రెడ్డి విషయంలో మరీ దూకుడుగా విమర్శలు చేయకుండా మిన్నకుండాలని పార్టీ నాయకులకు సూచనలు చేసినట్లుగా వినిపిస్తోంది. రేవంత్ ను ఆడిపోసుకోవడం మానేసి.. ఇతరత్రా పార్టీని కాపాడుకోవడం మీదే అందరూ దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించినట్లుగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబునాయుడు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నంత వరకు, తెదేపానుంచి ఆయనకు ప్రమాదం ఉండదని, విమర్శలు కూడా ఇక ఆగుతాయని పలువురు అంచనా వేస్తున్నారు.