తె-తెదేపా పతనం :: ‘చంద్ర’పాపమే!

ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో తిరుగులేని ప్రజాదరణ కలిగి ఉన్న, అప్రతిహతంగా ఏలుబడి సాగించిన పార్టీకి ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కీలక నాయకుడు పార్టీని వీడిపోతున్నారంటే.. అది ఎంత పెద్ద దెబ్బో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిణామం వల్ల పార్టీ మీద ఏ స్థాయిలో ప్రభావం ఉంటుందో కూడా అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం అనేది తెలంగాణలో తెలుగుదేశం పతనానికి పరాకాష్ట అనే విశ్లేషణలో సర్వత్రా వినిపిస్తున్నాయి.

ఇప్పటికే అనేక మంది నాయకులు తెరాసలోకి చేరిపోవడం వలన.. ఎక్కడికక్కడ కేడర్ ను కూడా కోల్పోయి కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు కూడా వేయలేని దుస్థితిలో తెలంగాణ తెలుగుదేశం ఉంది. అలాంటి నేపథ్యంలో మిగిలిఉన్న నాయకుల్లో అంతో ఇంతో రాష్ట్ర వ్యాప్త పట్టు కార్యకర్తల్లో క్రేజ్ ఉన్న ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ లోచేరితే.. తెరాస వ్యతిరేకత పుష్కలంగా ఉన్న తెలుగుదేశం దిగువస్థాయి కార్యకర్తలు , కేడర్ మొత్తం.. ఆయన వెంట కాంగ్రెస్ లోకి వెళ్లినా ఆశ్చర్యం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం తెరాస వ్యతిరేక పోరాటాన్ని కొనసాగిస్తుందనే నమ్మకం వారికి కలగకపోతే అదే జరుగుతుంది. ఇది పార్టీ పతనంగా మారుతుంది.

అయితే ఈ పతనం మొత్తం చంద్రబాబునాయుడు స్వయంకృతమే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీలో అధికారంలో ఉన్నంత మాత్రాన తెలంగాణ పార్టీని అనాథలా గాలికి వదిలేయడం భావ్యం కాదని.. కనీసం నెలకు ఒకసారి అయినా ఇక్కడ పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే.. పార్టీకి జవం జీవం నిలుస్తాయని గతంలో రేవంత్ రెడ్డి పలుమార్లు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.

ఇలాంటి సలహాలను చంద్రబాబు పట్టించుకోలేదు సరికదా.. రేవంత్ రెడ్డి తెలంగాణ పార్టీ సంగతులు మాట్లాడాలని సమయం కోరినప్పుడెల్లా… అమరావతికి రమ్మనే వారుట! ఇక్కడ పార్టీ గురించి మాట్లాడడానికి పొరుగు రాష్ట్రం అమరావతికి వెళ్లడం, అక్కడ నాలుగైదు గంటల పాటూ వెయిట్ చేస్తూ కూర్చుంటే నాలుగైదు నిమిషాల పాటూ అధినేత తో మాట్లాడే సమయం దొరకడం ఇలాంటి.. అపభ్రంశపు పోకడలతో రేవంత్ బాగా విసిగిపోయారుట.

కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతగా పోరాడుతున్నా.. అదేదో తన వ్యక్తిగత పోరాటం లాగా మారుతోందే తప్ప.. పార్టీ నుంచి, ప్రత్యేకించి అధినేత నుంచి నామమాత్రపు మద్దతు కూడా లేకపోతే.. ఎలా సక్సెస్ అవుతాం.. అనే అభిప్రాయమే రేవంత్ లో వ్యక్తమవుతోందిట. తెలంగాణ పార్టీని చంద్రబాబు సవతి బిడ్డలాగా చూస్తున్నాడని, ఈ వైఖరిని భరించలేకనే రేవంత్ రెడ్డి ఇంతటి తీవ్రమైన నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాకే నిర్ణయం ఉంటుందని రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటిస్తున్నారు. కానీ వాస్తవంలో అది లాంఛనమే అయ్యే అవకాశం ఉంది.