దక్షిణాదిన భాజపా మొదటి తప్పు

New Delhi: Prime Minister Narendra Modi and BJP President Amit Shah during the Central Election Committee (CEC) meeting for Uttar Pradesh state elections at BJP headquarters in New Delhi on Sunday. PTI Photo by Vijay Verma (PTI1_15_2017_000234B)

తప్పులు ఎన్నయినా చేయచ్చు. తప్పించుకోవచ్చు. కానీ ఒక్కోసారి వెనక్కు తీసుకోలేని తప్పటడుగు పడిపోతుంది. అలాంటిదే ఇప్పుడు భాజపా జనాలు చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ ఎలా చేసినా, ఏం చేసినా, కట్టుదిట్టమైన మీడియా మేనేజ్ మెంట్ వల్ల, సోషల్ మీడియా మేనేజ్ మెంట్ వల్ల నడిచిపోయింది. కానీ తొలిసారి పామర జనానికి పట్టే సినిమా దగ్గర తప్పటడుగు వేసారు. మెర్సాల్ అనే తమిళ సినిమాలో చిన్న డైలాగ్ ను జస్ట్ అలా వదిలేయకుండా కంపు చేసుకుంది భాజపా. ఇండియాలో ఇంత జీఎస్టీ, సింగపూర్ లో అంత జీఎస్టీ.. కానీ అక్కడ వైద్యం ఫ్రీ, ఇక్కడ కాదు అనే అర్థం వచ్చే డైలాగు అది. దీని మంచిచెడ్డలు, తర్క వితర్కాలు అలా వుంచితే మామూలుగా వదిలేసి వుంటే, జనం జస్ట్ అలా విని ఇలా వదిలేసి వుండేవారు.

కానీ భాజపా జనాలు ఆ డైలాగును ఎత్తి చూపారు. దాంతో సినిమా జనాలు సహజంగా తమ వాడికి మద్దతు పలికారు. ఆ వెంటనే అలా మద్దతు పలికిన వారిలో ఒకరైన విశాల్ ఆఫీస్ పై జీఎస్టీ అధికారుల దాడి జరిగింది. ఇది మరో పెద్దతప్పు. ఈ విషయంలో కేంధ్రం భయపడింది. ఎదురుదాడికి దిగింది అని జనాలకు అర్థమైపోయింది. సినిమా వాళ్లమీద దాడి అనగానే అందరికీ ఆసక్తి. దాంతో ఈవిషయం జనాల్లోకి కిందకు వెళ్లిపోయింది. తమిళనాట రాజకీయాలు వేరు సినిమాలు వేరుకాదు. రెండూ ఒక్కటే. విజయ్, విశాల్ అభిమానుల సంఖ్య తక్కువేమీ కాదు. వీరంతా కలిసి ఏదో చేసేస్తారని కాదు. జీఎస్టీ అనేదానిపై డిస్కషన్ జనాల్లో ప్రారంభం కావడానికి వీరి సంఖ్య చాలు.

ఇప్పటికే జీస్టీ విషయంలో భాజపా కిందా మీదా అవుతోందన్న సంగతి అందరికీ తెలిసిందే. అన్ని విజయాలు తమవే అనే మోడీ, కొద్ది రోజుల కిందటే జీఎస్టీ పాపంలో కాంగ్రెస్ కు కూడా వాటా వుందన్నట్లు మాట్లాడారు. తమిళనాట రాజకీయ శూన్యత వుంది, భాజపా సూపర్ స్టార్ రజనీతో కలిసి ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటుందీ అని అందరూ అనుకుంటున్న టైమ్ లో చేతికి అందిన దాన్ని పాడుచేసుకుంది. ఇక తమిళ నాట భాజపా ఎదగడం కష్టమనే మాట ఇప్పుడు వినిపించడం ప్రారంభమైంది.

సాధారణంగా కొన్నాళ్ల క్రితంవరకు మోడీ మీద, భాజపా మీద ఈగ వాలితే ఫేస్ బుక్, వాట్సప్ ల్లో నెటిజన్లు సర్రున లేచేవారు. కానీ గడచిన మూడు రోజులుగా ఆ పరిస్థితి కనిపించడంలేదు. దుకాణాల్లో జీఎస్టీ సెగ నేరుగా సామాన్యుడి నుంచి మధ్య తరగతి వరకు తగలడం ఓ కీలక కారణం. ఇదిలా వుంటే మెర్సాల్ తెలుగు వెర్షన్ సెన్సారును కూడా భాజపా అడ్డుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇది కూడా జనాల్లోకి వెళ్తే, సినిమాలో ఏదో వుందన్న సంగతి కన్నా, భాజపా భయపడుతోందన్న సంగతి బలంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం అనుకూల మీడియా మెల్లగా భాజపాకు వ్యతిరేకం అవుతోంది.

మోడీ వ్యతిరేక వార్తలను వండి వారుస్తున్నాయి. దీని వెనుక రెండు వ్యూహాలు కనిపిస్తున్నాయి. భాజపా బలాన్ని ఇక్కడ తగ్గించడం ద్వారా వాళ్లకు తెలుగుదేశంతో బేరం ఆడే చాన్స్ లేకుండా చేయడం. అదే సమయంలో తెలుగుదేశాన్ని ఒకవేళ భాజపా వీడినా సమస్య లేకుండా చూడడం. మొత్తంమీద భాజపా అవసరం లేకుండానే గట్టెక్కుతామనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ వున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో తనంతట తాను భాజపా సమస్యలు సృష్టించుకుంటే, అది ఆత్మహత్యా సదృశ్యమే. తమిళనాడు, ఆంధ్ర లాంటి రెండు పెద్ద దక్షిణాది రాష్ట్రాల విషయంలో కేంద్రం ఇలా దుందుడుగా వ్యహరించడం ఏమిటో?