‘నంది’ కాదది.. డాష్‌ డాష్‌ డాష్‌

నందమూరి నందులు.. ‘కమ్మ’ని నందులు.. సైకిల్‌ నందులు.. ‘నంది’ పురస్కారాలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేనంత దారుణమైన వివాదాల్ని, విమర్శల్నీ ఈసారి ‘నంది’ ఎదుర్కొంటోంది. ప్రతి యేటా సినీ పరిశ్రమకు ప్రభుత్వం తరఫున ఇచ్చే ఈ ‘నంది’ ఇంతలా వివాదాస్పదమవడానికి కారణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.! ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ, ఈ ‘నంది’ని పూర్తిగా, తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకోవడమే ఆ కారణం.

‘రుద్రమదేవి’ సినిమా విషయంలో అన్యాయం జరిగిందని దర్శక నిర్మాత గుణశేఖర్‌ ఆవేదన వ్యక్తం చేస్తే, ‘రేసుగుర్రం’ సినిమాని కావాలనే పక్కన పడేశారంటూ నిర్మాత నల్లమలుపు బుజ్జి మండిపడ్డారు. బండ్ల గణేష్‌, ‘అవి సైకిల్‌ నందులు’ అని స్పందిస్తే, ‘మెగా హీరోలు, తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర నటించడం నేర్చుకోవాలి’ అని నిర్మాత బన్నీ వాస్‌ పేర్కొన్నారు.

నిజానికి ‘రుద్రమదేవి’ సినిమాని లైట్‌ తీసుకోలేదనీ, ఆ సినిమా కోసం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ కేటగిరీలో అల్లు అర్జున్‌కి అవకాశం వచ్చిందనీ, ఎంట్రీ కూడా అలాగే దర్శక నిర్మాత గుణశేఖర్‌ కోరుకున్నారనీ ‘నంది’ కమిటీ నుంచి ఓ వాదన తెరపైకొచ్చింది. ‘హీరోని పట్టుకుని క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అంటారా.? నా సినిమాలో ఆ యువ హీరో ఓ మంచి పాత్ర పోషించారు. అది సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర.. అదే సపోర్టింగ్ రోల్.. పలు ప్రైవేటు సంస్థలు ఇచ్చిన పురస్కారాల్లో అల్లు అర్జున్ బెస్ట్ సపోర్టింగ్ రోల్ అనే అవార్డులు అందుకున్నారు.

ఆ పాత్ర స్థాయిని తగ్గించేలా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ కోటాలో నంది ఇవ్వడమేంటి? నేను ఇచ్చిన ఎంట్రీకి సంబంధించిన జిరాక్స్‌ కాపీ ఇదిగో..’ అంటూ గుణశేఖర్‌ తాజాగా మీడియా ముందుకొచ్చారు. ‘రుద్రమదేవి’ సినిమాకి అవార్డు రాకుండా అన్యాయం జరిగితే, అల్లు అర్జున్‌కి అవార్డ్‌ వచ్చి, అవమానం జరిగిందని గుణశేఖర్‌ ఆరోపించారు.

మరోపక్క, ‘రేసుగుర్రం’ సినిమాకి అన్ని కేటగిరీల్లోనూ అవార్డులు పొందే అర్హత వుందనీ, కథ, కథనం, హీరో, హీరోయిన్‌, కొరియోగ్రఫీ.. ఇలా అన్ని విభాగాల్లోనూ టాప్‌ క్లాస్‌ మూవీ అనీ, 100కోట్ల వసూళ్ళను సాధించిదనీ, అలాంటి సినిమాకి అన్యాయం జరిగిందనీ ఆరోపించిన నల్లమలుపు బుజ్జి ‘అవి నంది అవార్డులు కావు, పంచేసుకున్న అవార్డులు’ అంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. దొంగ అవార్డులనీ, ఇంకోటనీ.. సినీ ప్రముఖులే నంది అవార్డుల తీరుపై అసహనం వ్యక్తం చేుస్తున్న తీరు.. అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

‘కంచె’ సినిమా సహా, చాలా సినిమాల విషయంలో ‘నంది’ కమిటీ కేవలం ‘కులం’ కోణంలోనే చూసిందన్నది నల్లమలుపు బుజ్జి వాదన. ‘ఇది ప్రభుత్వం ఇచ్చే అవార్డ్‌.. ఇది ప్రజలకు సంబంధించినది.. ప్రేక్షకులకు సంబంధించినది.. జాతీయ అవార్డులు వచ్చిన సినిమాల్ని కూడా నంది కమిటీ పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరం’ అన్నారు నల్లమలుపు బుజ్జి.

మొత్తమ్మీద, ‘నంది’ వివాదం ఇక్కడితో ఆగేలా కన్పించడంలేదు.. ఒకరొకరుగా ‘నంది’ అన్యాయంపై భగ్గుమంటున్నారు. మూడేళ్ళుగా ‘నంది’ పురస్కారాల్ని ప్రకటించకపోయినా ఎవరూ పట్టించుకోలేదుగానీ, అవార్డుల్ని ప్రకటించి, సినీ పరిశ్రమలో కులాల కుంపట్లను చంద్రబాబు సర్కార్‌ రాజేసిందన్న విమర్శలు ఇప్పుడు తీవ్రస్థాయిలో విన్పిస్తున్నాయి.