నారా లోకేష్‌.. గ్రేట్‌, గ్రేటెస్ట్‌.!

ఒప్పుకుంటారా.? ఒప్పుకోరా.? మీరొప్పుకున్నా, ఒప్పుకోకున్నా నారా లోకేష్‌.. గ్రేట్‌, గ్రెటెస్ట్‌ అంతే.! ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు. ఎందుకంటే, ఆయన చిన్న వయసులోనే మంత్రి అయిపోయారు. అలా చిన్న వయసులో తాను మంత్రినవుతానని కలలో కూడా అనుకోలేదంటూ నారా లోకేష్‌ సెలవిచ్చారండోయ్‌.!

కామెడీకే పరాకాష్ట ఇది. తండ్రి ముఖ్యమంత్రి అయితే, కొడుక్కి మంత్రి పదవి దక్కడం పెద్ద విషయమా.? పాపం లోకేష్‌కి, ఆ లాజిక్‌ కూడా తెలియలేదంటే, ఆయన్నసలు రాజకీయ నాయకుడని ఎలా అనుకోగలం.! 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచాక, నారా లోకేష్‌కి మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ, చంద్రబాబే కాస్త తటపటాయించారు. ఎలాగైతేనేం, ఇటీవలే కొడుక్కి మంత్రి పదవి కట్టబెట్టేశారు చంద్రబాబు.

చంద్రబాబు కాస్త లేట్‌ చేశారుగానీ, లేకపోతే లోకేష్‌ 2014లోనే మంత్రి అయి వుండేవారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోడంతో, చంద్రబాబుపై నారా లోకేష్‌ ఏ స్థాయిలో ఒత్తిడి తెచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! ‘లోకేష్‌ని మంత్రిగా చెయ్యాల్సిందే.. అవసరమైతే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..’ అని ఓ ఎమ్మెల్యే, ‘ఎమ్మెల్సీ పదవిని లోకేష్‌ కోసం వదులుకోవడానికి సిద్ధంగా వున్నాను.. లోకేష్‌ని ఎమ్మెల్సీని చేసి, ఆ తర్వాత మంత్రిని చెయ్యాల్సిందే..’ అని ఇంకో ఎమ్మెల్సీ.. ఏ స్థాయిలో ఆ మధ్య హంగామా చేశారో అందరికీ గుర్తుండే వుంటుంది.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు.. లోకేష్‌ మంత్రి కాకపోతే ప్రపంచమే తల్లకిందులైపోతుందన్నట్లుగా హడావిడి చేసేశారు. ఆ హడావిడి ఫలించి, లోకేష్‌కి మంత్రి పదవి దక్కింది. అక్కడికేదో, ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రి అయిపోయినట్లు.. ప్రజాబలం తనకే వున్నట్లు, ‘చిన్న వయసులోనే మంత్రి పదవి వచ్చినందుకు చాలా గర్వంగా వుంది..’ అని లోకేష్‌ చెప్పుకుంటోంటే, జనం నవ్వుకుంటున్నారు. ప్చ్‌, చినబాబు నారా లోకేష్‌కి జనం నవ్వుకుంటున్న విషయం ఎలా అర్థమవుతుందబ్బా.?

ఎవ్వరూ పొగడనప్పుడు తమని తామే పొగుడుకోవాలన్నది చంద్రబాబుకి మాత్రమే తెలిసిన విద్య. ఇప్పుడు చంద్రబాబు తనయుడు చినబాబు.. అదేనండీ నారా లోకేష్ కూడా అదే బాటలో నడుస్తున్నట్టుంది.