నిజమే.. ఆయనకి అవి కొత్త కాదు.!

ఐటీ సోదాలు ఆయనకు కొత్త కాదు.. కేసులు అలవాటే.! అదే విషయాన్ని ఆయన ఇంకోసారి చెప్పారంతే. ‘నేను దేనికీ భయపడను..’ అంటూ శశికళ మేనల్లుడు దినకరన్‌ వీరావేశంతో స్టేట్‌మెంట్లు ఇచ్చేస్తోంటే, అంతా నోరెళ్ళబెట్టాల్సి వచ్చింది. దినకరన్‌పై ఇప్పటికే చాలా కేసులున్నాయి. తాజాగా ఐటీ సోదాల నేపథ్యంలో కొత్త కేసులు నమోదైతే, కేసుల పరంగా ‘ఇంకో బెంచ్‌ మార్క్‌’ని ఆయన అందుకుంటాడంతే.!

ఎంత కామెడీ అయిపోయిందో కదూ.. రాజకీయ నాయకులకి. దినకరన్‌కి అయితే మరీనూ.! అన్నాడీఎంకే పార్టీ గుర్తు కోసం దినకరన్‌, ఏకంగా ఎన్నికల కమిషన్‌కే లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన విషయం విదితమే. దినకరన్‌ ‘ఘనకార్యాల్లో’ ఇదే టాప్‌ ప్లేస్‌లో వుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్తుంటారు తమిళనాడులో. అదీ దినకరన్‌ గొప్పతనం.

ఇక, శశికళతోపాటు దినకరన్‌కి చెందిన ఆస్తులు, జయలలిత మరణానంతరం ఆమెకు చెందిన ఆస్తులపైనా ఐటీ సోదాలు జరిగాయి. శశికళ కూడా జైల్లో వుండడంతో, ఈ మొత్తం ఆస్తులన్నిటిపైనా దినకరన్‌ పర్యవేక్షణ వుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! అందునా శశికళకి, దినకరన్ మేనల్లుడాయె. నిన్ననే దినకరన్‌, జైలులో శశికళతో మంతనాలు జరిపారు. ఇంతలోనే, ఈ ఐటీ దాడుల వ్యవహారం తెరపైకొచ్చింది.

మరోపక్క, ఇటీవల తమిళనాడులో ప్రధాని నరేంద్రమోడీ పర్యటించడం, డీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శించడం, ఆ భేటీ ఫలితంగా పెద్ద నోట్ల రద్దుకి వ్యతిరేకంగా ఆందోళన చేయాలనుకున్న డీఎంకే వెనక్కి తగ్గడం.. ఇప్పుడిలా దినకరన్‌, శశికళ, జయలలిత ఆస్తులపై ఐటీ సోదాలు జరగడం.. అంతా కాకతాళీయమే అనుకోవాలా.?

జయలలిత ఎలాగూ జీవించి లేరు. శశికళ జైలుకి పరిమితమైపోయారు. ఈ తరుణంలో దినకరన్‌ పర్యవేక్షణలో వున్న ‘ఆ ముగ్గురి’ ఆస్తులపై ఐటీ దాడులు జరపడం ద్వారా, దినకరన్‌ అండ్‌ టీమ్‌ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలన్న ’పెద్ద తలకాయల‘ రాజకీయ వ్యూహాన్ని ఇక్కడ కొట్టి పారేయలేం. అదే సమయంలో, దినకరన్‌తోపాటు శశికళ అక్రమాల పుట్టపై జరుగుతున్న ఐటీ సోదాల్నీ సమర్థించకుండా వుండలేం.