నైజాంలో రికార్డులు బద్దలు కొట్టబోతున్న వకీల్‌సాబ్‌

పవన్ కళ్యాణ్ వకీల్‌ సాబ్ విడుదల కౌంట్ డౌన్‌ ప్రారంభం అయ్యింది. వచ్చే నెల 9వ తారీకున విడుదల కాబోతున్న వకీల్‌ సాబ్‌ సినిమా కోసం నైజాం ఏరియాలో భారీ రికార్డు వెయిట్‌ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. లాక్ డౌన్ తర్వాత థియేటర్ల టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వం గేట్లు ఎత్తి వేసినట్లుగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే నైజాం ఏరియా థియేటర్ల టికెట్ల రేట్లు విపరీతంగా పెంచేశారు. ముఖ్యంగా స్టార్‌ హీరోల సినిమాల మొదటి వారం టికెట్ల రేట్లు ఇష్టానుసారంగా పెంచుతున్నారు. దాంతో వకీల్ సాబ్‌ కు అదిరిపోయే ఓపెనింగ్స్ ఖాయం అంటున్నారు.

నైజాం ఏరియాలో అన్ని ప్రముఖ పట్టణాలు మరియు నగరాల్లో కూడా బెన్‌ ఫిట్ షోలు వేయబోతున్నారు. వాటికి 300 నుండి 500 వరకు టికెట్ల రేట్లను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. నైజాం ఏరియాలో భారీ ఎత్తున మిడ్‌ నైట్‌ షో లు బెన్‌ ఫిట్‌ షో లు వేయబోతున్న నేపథ్యంలో ఓపెనింగ్‌ విషయంలో గతంలో ఎప్పుడు లేనంత భారీ మొత్తంలో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. పవన్‌ మూవీ అంటేనే అభిమానులు మరో రేంజ్ క్రేజ్ పెట్టుకున్నారు. వకీల్ సాబ్‌ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న కారణంగా వసూళ్లు ఇండస్ట్రీ హిట్‌ ఖాయం అంటున్నారు.