‘పద్మావతి’ కష్టాలు తొలగిపోతాయా.?

‘పద్మావతి’.. ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై ఇదో అద్భుతం కాబోతోందంటూ ప్రచారం జరుగుతోన్న బిగ్గెస్ట్‌ ప్రాజెక్ట్‌. భారీ బడ్జెట్‌తో ‘పద్మావతి’ చిత్రాన్ని సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న విషయం విదితమే. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ ‘పద్మావతి’ సినిమాని మొదటి నుంచీ వివాదాలు వెంటాడుతూనే వున్నాయి. సినిమా షూటింగ్‌ కోసం వేసిన సెట్స్‌ని తగలబెట్టేయడం దగ్గర్నుంచి, సినిమాకి వ్యతిరేకంగా కోర్టుకెళ్ళడం వరకూ.. ఏ స్థాయిలో రచ్చ జరుగుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

డిసెంబర్‌ 1న సినిమా విడుదల కానున్న దరిమిలా, సినిమాపై వివాదాలు మరింత ముదిరి పాకాన పడ్తున్నాయి. సినిమాని విడుదల చేస్తే, థియేటర్లను పేల్చేస్తామని కొందరు హెచ్చరిస్తున్నారు. తెలుగునాట బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, ‘పద్మావతి’ సినిమాపై భగ్గుమంటున్నారు. సినిమాలో ‘రాణి పద్మినిని’ కించపర్చే సన్నివేశాలుంటే, సహించేది లేదని హెచ్చరిస్తున్నారాయన.

వరుస వివాదాల నేపథ్యంలో దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ వీడియో ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తూ, కొన్ని ‘మంచి’ మాటలు చెప్పాడాయన. రాణి పద్మినిని కించపర్చే సన్నివేశాలుగానీ, రాణి పద్మిని పాత్రకీ అల్లావుద్దీన్‌ ఖిల్జీ పాత్రకీ మధ్య అసభ్యకర సన్నివేశాలుగానీ సినిమాలో చిత్రీకరించలేదని సంజయ్‌ లీలా భన్సాలీ వివరించాడు.

‘ఈ సినిమాని వ్యయప్రయాసలకోర్చి తీశాను.. అన్నిటికీ మించి, చారిత్రక నేపథ్యమున్న ఈ కథాంశం నా మనసుకి దగ్గరయ్యింది. అంతలా ప్రేమించి తీసిన ఈ సినిమాపై వివాదాలు నన్ను బాధించాయి. నేను హామీ ఇస్తున్నా, ఎవర్నీ కించపర్చే ఉద్దేశ్యంతో ఈ సినిమా తీయలేదు..’ అని వివరణ ఇచ్చాడు సంజయ్‌ లీలా భన్సాలీ.

దీపికా పడుకొనే, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌సింగ్‌ నటిస్తోన్న ‘పద్మావతి’ విడుదలకు ముందు దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఇచ్చిన వివరణతో సినిమా ఎలాంటి వివాదాలూ లేకుండా ప్రేక్షకుల ముందుకొస్తుందా.? వేచి చూడాల్సిందే.