పవన్‌ – పరకాల.. ఏందీ గోల.?

ప్రజారాజ్యం పార్టీని పరకాల ప్రభాకర్‌ ఎప్పుడో మర్చిపోయి వుంటారు. ఆయనగారి సతీమణి ప్రస్తుతం బీజేపీలో వున్నారు. పైగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాంటిలాంటి శాఖ కాదు, ఏకంగా రక్షణ మంత్రిగా పరకాల సతీమణి నిర్మలా సీతారామన్‌కి ఛాన్స్‌ దక్కింది. ప్రస్తుతం పరకాల ప్రభాకర్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ‘సలహాదారు’గా పనిచేస్తోన్న విషయం విదితమే. అంటే, ఆయన ఇంట్లో రెండు పార్టీలు వున్నాయన్నమాట.

టీడీపీ – బీజేపీ నేతలు వీలు చిక్కినప్పుడల్లా ఒకరి మీద ఇంకొకరు విమర్శలు చేసుకుంటుంటారు. బీజేపీ, టీడీపీని విమర్శించడం.. టీడీపీ, బీజేపీని విమర్శించడం మామూలే. కానీ, పరకాల ఇంతవరకు బీజేపీని విమర్శించింది లేదు. ఎందుకు.? అంటే, అదంతే.! ఒకప్పుడు పరకాల ప్రభాకర్‌, ప్రజారాజ్యం పార్టీలో అత్యంత కీలక భూమిక పోషించిన విషయం విదితమే. ఆ పార్టీ సిద్ధాంతకర్తల్లో పరకాల ప్రభాకర్‌, మిత్రా వంటివాళ్ళని ముఖ్యులుగా చెప్పుకోవచ్చు. అఫ్‌కోర్స్‌, పరకాల ప్రజారాజ్యం పార్టీని వీడుతూ, ఆ పార్టీపై ‘విషవృక్షం’ అంటూ విమర్శలు చేశారనుకోండి.. అది వేరే విషయం.

ఇప్పుడిదంతా ఎందుకంటే, ఆనాటి ఆ ప్రజారాజ్యం పార్టీ రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు పవన్‌కళ్యాణ్‌. ‘తెల్లారిందోయ్‌ మావా..’ అన్న చందాన తయారయ్యింది పవన్‌కళ్యాణ్‌ పరిస్థితి. లేకపోతే, ఎప్పుడు ప్రజారాజ్యం.. ఏంటా కథ.! ఇప్పుడు ఆ ప్రజారాజ్యాన్ని గుర్తుచేసుకుని, పరకాల ప్రభాకర్‌ని టార్గెట్‌ చేయడమేంటి.?

గడచిన మూడున్నరేళ్ళలో ఏనాడూ పవన్‌కళ్యాణ్‌, పరకాలని టార్గెట్‌ చేయలేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌నీ ప్రశ్నించింది లేదు. ఎందుకంటే, బహుశా అప్పుడాయనకి సోయ వుండి వుండదు.. ఇప్పుడే సోయ వచ్చి వుండొచ్చు. ‘పరకాల లాంటోళ్ళు జనసేనకి వద్దు..’ అంటూ తాజాగా రాజమండ్రిలో జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్‌ చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా గురించి పరకాల, ఆయన సతీమణి నిర్మలా సీతారామన్‌ ఎందుకు డిమాండ్‌ చేయడంలేదని ప్రశ్నించేశారు.

ప్రత్యేక హోదా విషయం కావొచ్చు, ఇంకొకటి కావొచ్చు.. పవన్‌కళ్యాణ్‌కి గడచిన మూడున్నరేళ్ళలో ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్‌ సమస్యల గురించి గుర్తుకొచ్చినట్లు.? ఎన్నిసార్లు ఆయన అటు కేంద్రాన్నిగానీ, ఇటు రాష్ట్రాన్నిగానీ ప్రశ్నించినట్లు.?

అయినా, పరకాల ప్రభాకర్‌ విషయంలో పవన్‌కళ్యాణ్‌ ఇంతలా హర్టయ్యారంటే.. వ్యవహారం ఎక్కడో చాలా గట్టిగానే తేడా కొట్టి వుండాలి. అసలంటూ పార్టీయే కాలగర్భంలో కలిసిపోయినా, ఇంకా పరకాలని పవన్‌ మర్చిపోకపోవడం ఆశ్చర్యకరం. అయినా, రాజకీయాల్లో ‘వదిలేది లేదు, బదులు తీర్చుకుంటా..’ అని నినదించడమంటే, ఇంకా పవన్‌కళ్యాణ్‌లో ‘చంటిపిల్లాడి’ తత్వం పోలేదనే అనుకోవాలి. పరకాలని ప్రశ్నిస్తే ప్రత్యేక హోదా వస్తుందా.? కాంగ్రెస్‌లో కలిసిపోయిన ప్రజారాజ్యం తిరిగొస్తుందా.? చిరంజీవైనా, పవన్‌కళ్యాణ్‌కి అర్థమయ్యేలా చెబితే బావుంటుంది.