పురందేశ్వరికి ఒక సీటు కావలెను!

భారతీయ జనతా పార్టీలో దగ్గుబాటి పురందేశ్వరి చాలా కీలక నాయకురాలిగా ఎదుగుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె ఎంట్రీ ఏదో గతిలేని పరిస్థితుల్లో జరిగి ఉండవచ్చు గానీ.. ఆమెకు సహజమైన దూకుడు… నేపథ్యం, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం.. అప్పట్లో కాంగ్రెస్ సర్కారులోనే మెప్పించిన వైనం.. ఇప్పుడైనా ఢిల్లీ పెద్దలతో కలివిడిగా ఉండగల నేర్పు అన్నీ కలిపి భాజపాలో కూడా ఆమె హవా కొనసాగే పరిస్థితి సృష్టిస్తున్నాయని పలువురు అంటున్నారు. దానికి తగినట్లు ఆంధ్రప్రదేశ్ లో భాజపాను విస్తరించాలనే వ్యూహానికి కూడా ఆమె కీలకంగా మారుతున్నారు. తెలుగుదేశంతో పొత్తులున్న సంగతిని పట్టించుకోకుండా, ఆ పార్టీకి బద్ధ శత్రువులైన వారిని కూడా పార్టీలో చేర్చుకోవడానికి చక్రం తిప్పుతున్నారు.

ఇదంతా బాగానే ఉంది. మరి పురందేశ్వరికి తనకంటూ ఓ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం చాలా క్లిష్టంగా మారిపోయింది. ఆమె పార్లమెంటు రాజకీయాలను మాత్రమే కోరుకుంటున్నారు. కేంద్రమంత్రి హోదాను వెలగబెట్టిన తర్వాత.. మెట్టు దిగి కిందికి రావడం ఆమెకు ఇష్టం లేదు. అయితే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆమె భాజపాలోకి ఎంటరవ్వడమే ఆలస్యం అయింది. అప్పటికే తెదేపాతో పొత్తులు ఖరారయ్యాయి. సీట్లు దాదాపుగా కొలిక్కి వచ్చాయి. ఆమెకు బలమున్న సీట్లు దొరకలేదు. ఇతరుల (ఎమ్మెల్యేల) బలం మీద ఆధారపడి గెలవాల్సిన స్థితిలో ఆమె కడపజిల్లా రాజంపేట (కొంత చిత్తూరు జిల్లా పరిధిలోకి వస్తుంది కూడా) నుంచి ఎంపీగా బరిలోకి దిగి భంగపడ్డారు. వైసీపీ యువనేత మిధున్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

అయితే ఈసారి ఎన్నికల్లో ఆమెకు ఆ సీటు కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఓడిన తర్వాత అయినా … ఆ నియోజకవర్గంలో ఆమె బలం పెంచుకున్నది కూడా లేదు గానీ.. ప్రస్తుతం ఆ నియోజకవర్గం పరాధీనం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. తెదేపా దానికోసం ఆశలు పెట్టుకోవడం లేదుగానీ.. కమలదళంలోనే ఆ సీటుకోసం ఆమెకు పోటీ తప్పేలా లేదు. మొన్నటిదాకా వెంకయ్యనాయుడుకు సహాయకుడిగా ఉన్న సత్య, ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి, పార్టీలో చేరారు.

ఆయన రాజంపేట ఎంపీ స్థానంనుంచి బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. తనకు అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయనేది ఆయన వాదన. పైగా ఆయన ఆ నియోజకవర్గానికి స్థానికుడు. ఆ రకంగా ఆయన టికెట్ రేసులో పైచేయి సాధిస్తే రాజంపేట అభ్యర్థి అవుతారు. మరి పురందేశ్వరి ఏం కావాలి. పొత్తులు లేకుండా తెదేపా- భాజపా విడివిడిగా ఎన్నికలకు వెళితే తప్ప.. ఆమె కోరుకునే సీటు ఆమెకు దక్కకపోవచ్చు. మరి అలాంటి పరిణామాలు జరుగుతాయో లేదో వేచిచూడాలి.