పెద్ద చిట్టా విప్పాడు.. ఒక్కటీ ప్రకటించడు!

బోయపాటి శ్రీను.. మాస్ సినిమాలు తీయడంలో దిట్ట. ఇతడితో సినిమా చేసేందుకు చాలా హీరోలు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని బోయపాటి కూడా ప్రకటించాడు. బాలయ్య, చిరంజీవి, మహేష్ బాబు, అఖిల్.. ఇలా చాలా మంది హీరోల లిస్ట్ చదివాడు. కానీ అవన్నీ పేవర్ వరకే పరిమితం. ఇప్పటివరకు తన నెక్ట్స్ సినిమా ఎనౌన్స్ చేయలేకపోతున్నాడు ఈ మాస్ దర్శకుడు.

జయజానకి నాయక సినిమా విడుదలై 2 నెలలు దాటింది. కానీ బోయపాటి మాత్రం తన కొత్త సినిమా చెప్పలేదు. వెంటనే బాలయ్యతో మూవీ ఉంటుందని ప్రకటించిన ఈ దర్శకుడు ఆ సినిమాపై ప్రస్తుతం పెదవి విప్పడం లేదు. త్వరలోనే చెబుతానంటూ తప్పించుకుంటున్నాడు. దీనికి కారణం బాలయ్య తన నెక్ట్స్ సినిమాపై క్లారిటీ ఇవ్వకపోవడమే.

అటు మహేష్ బాబు, చిరంజీవి సినిమాలు కూడా ఉన్నాయని ప్రకటించిన బోయపాటి.. వాటి అప్ డేట్స్ కూడా చెప్పలేకపోతున్నాడు. ప్రస్తుతం ఇద్దరూ బిజీగా ఉన్నారు కాబట్టి సినిమా చేయలేకపోతున్నానని ప్రకటించాడు. వీళ్లలో చిరంజీవికి మాత్రమే స్టోరీలైన్ వినిపించిన బోయపాటి.. మహేష్ కు ఇప్పటివరకు కథే చెప్పలేకపోయాడు.

ఇలా లిస్ట్ లో చెప్పిన హీరోలతో సినిమాలు చేయలేకపోతున్న బోయపాటి.. తాజాగా రామ్ చరణ్ తో సినిమా ఉంటుందంటూ లీకులు వదులుతున్నాడు. తను చెప్పిన స్టోరీలైన్ కు చెర్రీ ఒప్పుకున్నాడని, కచ్చితంగా సినిమా ఉంటుందని అంటున్నాడు. కానీ చరణ్ కూడా బిజీ. రంగస్థలం తర్వాత కొరటాలతో సినిమా చేయబోతున్నాడు. సో.. ప్రస్తుతానికైతే బోయపాటి చెప్పిన లిస్ట్ లో హీరోలెవరూ ఫ్రీగా లేరు.