పైరసీ: నొప్పి కామన్‌.. ఏడ్చేది కొందరే.!

పైరసీ సినీ పరిశ్రమను తొలిచేస్తోంది. దీన్ని ఎయిడ్స్‌తో పోల్చుతారు కొందరు.. కాదు కాదు, క్యాన్సర్‌ని మించిన మహమ్మారి అంటారు ఇంకొందరు. శుక్రవారం వచ్చిందంటే.. అదీ పెద్ద సినిమా విడుదలయ్యిందంటే, ఆ వెంటనే ‘పైరసీ’ అంశం తెరపైకొస్తుంటుంది. పెద్ద సినిమాల విషయంలో ‘పెద్ద వాయిస్‌’తో పైరసీకి వ్యతిరేకంగా గగ్గోలు పెట్టడం కామన్‌. చిన్న సినిమానీ పైరసీ చిదిమేయడం మామూలే. కానీ, ఆ ‘చిన్న వాయిస్‌’ పెద్దగా పైకి రాదు.

ఈ పైరసీ ఫలానా సినిమాకి, ఫలానా హీరోకి మాత్రమే పరిమితం కాదు. మొత్తంగా సినీ పరిశ్రమను పైరసీ పీల్చిపిప్పి చేసేస్తోన్న మాట వాస్తవం. మరి, అలాంటప్పుడు పైరసీకి వ్యతిరేకంగా మొత్తంగా సినీ పరిశ్రమ రంగంలోకి దిగాలి కదా.! ఎందుకు దిగదు, అడపా దడపా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం చూస్తూనే వున్నాం. కానీ, ఆ పోరాటం సరిపోదు, అంతకు మించిన పోరాటం జరగాల్సిందే.

టిక్కెట్‌ ధరలు పెరిగిపోయాయి.. అది చాలదన్నట్టు, బ్లాక్‌ మార్కెటింగ్‌కి సినీ పెద్దల మద్దతు వుండడంతో, సినిమా ఎప్పుడో సామాన్యుడికి దూరమైపోయింది. ‘తొలి వారం వసూళ్ళు’ అనే కాన్సెప్ట్‌ వచ్చినప్పటినుంచీ, వారం, రెండు వారాల పాటు అదనపు రేట్లు (అధికారికంగా, అనధికారికంగా) పెంచేయడం పైరసీకి మరింత బలాన్నిస్తోందన్నది నిర్వివాదాంశం.

అన్నట్టు, ఓ హీరో సినిమా రిలీజైతే ఇంకో హీరో అభిమానులు ఆ సినిమా పైరసీని పరోక్షంగా ప్రోత్సహించడం ఓ ‘ట్రెండీ థింగ్‌’ అయిపోయింది. మొబైల్‌ ఫోన్‌తో థియేటర్‌లోకి వెళ్ళి, స్క్రీన్‌ మీద మొత్తం సినిమాని క్యాప్చర్‌ చేసి సోషల్‌ మీడియాలో వదిలేస్తున్నారు కొందరు. ‘బాహుబలి’ సహా పలు సినిమాలకు ఇది చాలా తలనొప్పిగా మారింది. అయినాగానీ, సినీ పరిశ్రమ నుంచి ‘సమైక్య పోరాటం’ మాత్రం ఆశించిన స్థాయిలో జరగడంలేదు.

ఇప్పుడు పైరసీ దెబ్బ ‘జవాన్‌’కి తగిలింది. ఆ చిత్ర దర్శకుడు బీవీఎస్‌ రవి గగ్గోలు పెట్టాడు. రేప్పొద్దున్న ఇంకో సినీ ప్రముఖుడికి నొప్పి కలుగుతుంది.. ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఇంతేనా.? ఇంకేమీ లేదా.! చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా.. సినీ పరిశ్రమ తరఫున ఓ టీమ్‌ ఏర్పాటయి ఆ సినిమా విడుదల సందర్భంగా పైరసీని మానిటరింగ్‌ చేస్తేనో.! ఆలోచన బాగానే వుంటుంది.. ఆ స్థాయి ‘ఐకమత్యం’ సినీ పరిశ్రమలో వుండొద్దూ.?

‘మేమంతా సినీ కళామతల్లి బిడ్డలం..’ అని చెప్పుకోవడం బాగానే వుంటుంది.. సాటి సినీ జీవికి కష్టమొస్తే, అదీ పైరసీ కారణంగా సమస్య వస్తే.. పట్టించుకోని మిగతా జీవుల్ని ఏమనాలి.? తమ సినిమాల టిక్కెట్ ధర పెంచడం కోసం ప్రభుత్వ పెద్దల్ని ప్రసన్నం చేసుకునే సినీ ప్రముఖులు.. పైరసీ విషయంలో తీసుకురావాల్సిన స్థాయిలో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తే బావుంటుందేమో.!