పోలవరం – ఏమిటీ ‘చంద్ర’మాయ.?

పోలవరం ప్రాజెక్టు దేశంలోనే అత్యంత ప్రత్యేకమైనది. ఇది ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి మాత్రమే కాదు.. దేశానికి జీవనాడి.. ఈ మాటలతో ఎవరైనా ఏకీభవించాల్సిందే. అందుకేనేమో, బ్రిటిష్‌ హయాంలో పోలవరం ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఆలోచనలు జరిగాయి. దురదృష్టవశాత్తూ స్వాతంత్య్రం సిద్ధించి, ఏడు దశాబ్దాలు పూర్తయినా, ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్టు ఇంకా కార్యరూపం దాల్చలేదు.

కారణాలేవైతేనేం, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో పోలవరం ప్రాజెక్టుకి మహర్దశ పట్టిందనే చెప్పాలి. జాతీయ ప్రాజెక్టుగా నాటి మన్మోహన్‌ సర్కార్‌, పోలవరం ప్రాజెక్టుకి హోదా కల్పించడంతో, పోలవరం ప్రాజెక్టు అనే ఓ కల సాకారమయ్యేందుకు ఆస్కారమేర్పడింది. ఆ తర్వాత కూడా చాలా రాజకీయమే నడిచింది. ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నా, అదెప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. అసలంటూ పోలవరం ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు ‘అంత శక్తి లేదు’ అన్న విమర్శలు ఈనాటివి కావు. అయినా, ఆ సంస్థే నిర్మాణ పనులు చేపట్టింది, కొనసాగిస్తోంది.

ఇటీవలే, కాంట్రాక్టర్‌ని తప్పించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయం తీసేసుకున్నారు. కామెడీ ఏంటంటే, పోలవరం జాతీయ ప్రాజెక్టు. పనులు ఆంధ్రప్రదేశ్‌వి.. పర్యవేక్షణ మాత్రం కేంద్రానిది. చంద్రబాబు తన గొప్ప కోసం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని తీసుకుంటే, పేరు తమ ఖాతాలో పడాలని కేంద్రమూ సందర్భానుసారం కొర్రీలు పెడ్తోంది. కాంట్రాక్టర్‌ని మార్చాలని చంద్రబాబు సర్కార్‌ భావిస్తే, ససేమిరా అనేసింది కేంద్రం. ఇక్కడ చంద్రబాబు ‘పెత్తనం’పై కేంద్రం కొరడా ఝుళిపించిందనే అనుకోవాలి.

ఏమో, ముందు ముందు ఏం జరుగుతుందోగానీ, చంద్రబాబు లెక్కల ప్రకారమైతే దాదాపు 50 వేల కోట్ల రూపాయల పైనే ఖర్చవుతుంది పోలవరం ప్రాజెక్టుకి. ఇప్పటిదాకా కేంద్రం 10 వేల కోట్లు కూడా ఆ ప్రాజెక్టు కోసం కేటాయించిన దాఖలాల్లేవు. బిల్లులు సమర్పిస్తే, 75 శాతం నిధులు తక్షణమే విడుదల చేస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తాజాగా ప్రకటించేశారు. ఇప్పటిదాకా ఆ పనెందుకు జరగలేదన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.

మొత్తమ్మీద, పోలవరం ప్రాజెక్టు పేరుతో పెద్ద ‘రాజకీయం’ నడుస్తోంది. ఆ రాజకీయం సామాన్యుడికి అర్థం కావడంలేదాయె. ఆ మాటకొస్తే, రాజకీయాల్లో తలపండిపోయిన చంద్రబాబే పోలవరం రాజకీయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. కాంట్రాక్టు సంస్థపై విపక్షాలు అభ్యంరతాలు వ్యక్తం చేస్తే చంద్రబాబు గుస్సా అయ్యారు. అంతకు ముందు ఆయనా ఆ సంస్థపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వ్యక్తే.. మళ్ళీ ఇప్పుడాయన ఆందోళన చెందుతున్నారు. కేంద్రమేమో చంద్రబాబుకి ఝలక్‌ ఇస్తోంది. కేంద్రం వద్దకు వెళ్ళి చంద్రబాబు బుజ్జగించి వస్తారట. నిధులు ఇచ్చేస్తామని కేంద్రం చెబుతోంది.. ఇచ్చే పరిస్థితి లేదనే వాస్తవం సుస్పస్టంగా కన్పిస్తోంది. ఏమిటీ మాయ.? ఇది చంద్రమాయా.? మోడీ మాయా.? ఆ పైవాడికే ఎరుక.