ప్రజా సంకల్పం – టీడీపీ వేగులు ఏం చెప్పారట.?

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర గురించి ప్రకటించగానే, తెలుగుదేశం పార్టీ ఉలిక్కి పడింది. ‘పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారు..’ అన్న సెంటిమెంట్‌ తెలుగుదేశం పార్టీకే ఎక్కువ. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేసి, ముఖ్యమంత్రి అయ్యారు గనుక.. అదే కోవలో తానూ పాదయాత్ర చేస్తే, ముఖ్యమంత్రినవుతానని టీడీపీ అధినేత చంద్రబాబు అనుకున్నారు.. అనుకున్నట్టుగానే జరిగిందంతా.!

‘పాదయాత్ర కాదు కదా, తల్లకిందులుగా తపస్సు చేసినా జగన్‌ ముఖ్యమంత్రి అవలేరు..’ అంటూ టీడీపీ పైకి ఎన్ని కహానీలు విన్పించినా, తెరవెనుక జగన్‌ పాదయాత్రతో తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందన్న ఆందోళన మాత్రం టీడీపీ నేతల్ని వెంటాడుతూనే వుంది. ఆ ఆందోళనని పైకి కనబడనీయకుండా టీడీపీ నేతలు ‘మేకప్‌’ చేసుకుంటున్న తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

ఇంతకీ, తొలి రోజు జగన్‌ పాదయాత్రపై అధికార తెలుగుదేశం పార్టీకి అందిన సమాచారం ఏంటట.? ‘బాగానే వుందిగానీ..’ ఇదీ, టీడీపీ అందుకున్న సమాచారం. ఇంతకు మించి, ‘జగన్‌ పాదయాత్ర అద్భుతః’ అన్న నివేదిక అయితే టీడీపీకి అందదు. ఎందుకంటే, ఆ సమాచారం తీసుకొచ్చేదే ‘పచ్చ’ వేగులు గనుక. టీడీపీ అనుకూల మీడియా సైతం, జగన్‌ పాదయాత్రకు సంబంధించి ఇదే సమాచారాన్ని టీడీపీ అధినాయకత్వానికి అందజేసిందట.

టీడీపీ ఫీడ్‌బ్యాక్‌ సంగతి పక్కన పెడితే, తొలిరోజు వైఎస్‌ జగన్‌ పాదయాత్రని పెర్‌ఫెక్ట్‌గా ‘డిజైన్‌’ చేసి, వారెవ్వా అనిపించుకుంది వైఎస్సార్సీపీ. తొలి రోజు పాదయాత్ర సందర్భంగా జగన్‌ ‘అత్యుత్సాహం’ ఎక్కడా ప్రదర్శించలేదు. పైగా, అన్ని వర్గాల ప్రజానీకం జగన్‌ పాదయాత్రలో కన్పించారు. షరామామూలుగానే జగన్‌, తన ట్రేడ్‌ మార్క్‌ ‘పలకరింపు’తో అందర్నీ ఎట్రాక్ట్‌ చేశారు.

బహిరంగ సభలో జగన్‌, అధికార పార్టీపై చేసే విమర్శలు కొత్తవేమీ కావు. ఇంతకు మించి, జగన్‌ టీడీపీ మీద కొత్తగా ఆరోపణలు చేయడానికీ ఏమీ వుండదు. వేసిన ప్రశ్నే మళ్ళీ మళ్ళీ వేస్తున్నా, అధికార పార్టీ ఎదురుదాడి తప్ప, జగన్‌ సంధించే ప్రశ్నలకి సమాధానం చెప్పదాయె. సాయంత్రం టీవీల్లో చర్చాకార్యక్రమాలు దర్శనమిచ్చాయి. అక్కడా టీడీపీది ఒకటే మంత్రం.. అదే ఎదురుదాడి. ఉద్యోగాల సంగతేంటి.? అన్న ప్రశ్నకు సమాధానం లేదు, ఇక ఏ ప్రశ్నకీ సమాధానం టీడీపీ నుంచి దొరకదు.

‘జగన్‌, 16 నెలలు జైల్లో ఎందుకు వున్నారో చెప్పాలి.. ఆ తర్వాతే పాదయాత్ర చేయాలి..’ అన్న ఒక్క మాటనే పట్టుకుని టీడీపీ నేతలు కొందరు, డిస్కషన్స్‌లో వేలాడారు. ప్చ్‌, ఆ వేలాడ్డంలోనే టీడీపీ నేతలు, జగన్‌ పాదయాత్రని చూసి ఏ స్థాయిలో భయపడ్తున్నారో అర్థమవుతోంది. మొత్తమ్మీద, తొలిరోజు పాదయాత్రతో జగన్‌, ‘ఇంపాక్ట్‌’ గట్టిగానే చూపించారనొచ్చు. ఇప్పుడే కదా, తొలి అడుగు పడింది.. చిన్న చిన్న లోపాల్ని సరిదిద్దుకుంటూ జగన్‌ వేయబోయే ప్రతి అడుగూ, అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేయనుందన్నది నిర్వివాదాంశం.