ప్రభాస్ రాజు: రూమర్లకే రారాజు

అవును.. ప్రస్తుతం ప్రభాస్ చుట్టూ తిరుగుతున్నన్ని పుకార్లు మరే హీరోకు లేవు. సినిమాలు, పెళ్లి, బాలీవుడ్ ఎంట్రీ.. ఇలా విషయం ఏదైనా ప్రభాస్ మాత్రం కామన్ అయిపోయాడు. ఇవాళ్టికి సరిగ్గా వారం రోజుల్లో మరో పుట్టినరోజు జరుపుకుంటున్న వేళ.. ఈ హీరోపై రూమర్లు ఇప్పుడు పీక్ స్టేజ్ లో నడుస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చుట్టూ చక్కర్లు కొడుతున్న 4 అతిపెద్ద రూమర్లేంటో చూద్దాం.

రూమర్-1
ప్రభాస్ పుట్టినరోజుకు సాహో ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందట. మూవీకి సంబంధించి టీజర్ ఇప్పటికే విడుదలైంది. అది కూడా సినిమా సెట్స్ పైకి రాకముందు తయారుచేసిన టీజర్. ఇప్పుడు మూవీ సెట్స్ పైకి వచ్చింది కాబట్టి.. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సాహో ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చేలా.. తాజాగా ప్రభాస్ పై సెట్స్ లోనే ఓ స్పెషల్ ఫొటోషూట్ నిర్వహించారు.

రూమర్-2
నెక్స్ సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారట. సాహో సినిమా తర్వాత దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తో సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈమధ్య పవన్ కల్యాణ్ తన కొత్త సినిమాకు సంబంధించి థీమ్ పోస్టర్ విడుదల చేశారు. అదే రూట్లో రాధాకృష్ణ కుమార్ సినిమాకు సంబంధించి ప్రభాస్ లుక్ తో ఓ థీమ్ పోస్టర్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట.

రూమర్-3
ప్రభాస్ పుట్టినరోజు చుట్టూ రౌండ్స్ కొడుతున్న మరో రూమర్ బాలీవుడ్ మూవీ. కచ్చితంగా ఓ హిందీ సినిమా చేస్తానని ప్రభాస్ ఇప్పటికే ప్రకటించడంతో అందరి ఆలోచనలు ఈ యాంగిల్ లో సాగుతున్నాయి. ప్రభాస్ పుట్టినరోజు నాడు నిర్మాత-దర్శకుడు కరణ్ జోహార్ ఈ నయా ప్రాజెక్టును ఎనౌన్స్ చేయొచ్చని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

రూమర్-4
ఇక చివరిది, చాలా మందిని ఎట్రాక్ట్ చేస్తున్న పుకారు ప్రభాస్ పెళ్లి. బాహుబలి-2 తర్వాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని కృష్ణంరాజు ఇదివరకే ప్రకటించారు. ఆ మధ్య దీనికి సంబంధించి కొన్ని పుకార్లు కూడా వచ్చాయి. సో.. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పెళ్లి ప్రకటన వచ్చే అవకాశం ఉందంటూ ఓ సెక్షన్ చెబుతోంది. ఇలా ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ చుట్టూ చాలా పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి.