ఫస్ట్ ప్రభాస్ పెళ్లి.. నెక్ట్స్ నాది!

తొలిప్రేమ సక్సెస్ తో హుషారుగా ఉన్న వరుణ్ తేజ్, మీడియా ఇంటర్వ్యూల్లో భాగంగా తన పర్సనల్ విషయాల్ని కూడా షేర్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా తన లవ్ లైఫ్, పెళ్లికి సంబంధించి రియాక్ట్ అయ్యాడు వరుణ్ తేజ్.”ప్రస్తుతానికి నా లైఫ్ లో లవ్ లేదు. నా కెరీర్ తోనే నేను ప్రేమలో ఉన్నాను. మరో సక్సెస్ వచ్చింది కదా, కెరీర్ పై ప్రేమ ఇంకా పెరిగింది. ఇక వాలంటైన్స్ డే విషయానికొస్తే నా ఫ్రెండ్స్, బాయ్స్ తో బయటకు వెళ్తాను. ఎక్కడికి వెళ్తున్నావని ఇంట్లో అడుగుతారు. కానీ నేనేంటో వాళ్లకు తెలుసు. ఓసారి ఓ అమ్మాయి కోసం నా ఇంట్లో నేనే కేక్ తయారుచేశాను. అమ్మకు తెలుసు.”

ప్రేమ సంగతి పక్కనపెడితే పెళ్లికింకా చాలా టైం ఉందంటున్నాడు వరుణ్. ప్రస్తుతానికి తన మైండ్ లో పెళ్లికి సంబంధించిన ఆలోచనలు లేవని, తనకంటే ముందు నితిన్, ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని అంటున్నాడు.”పెళ్లికింకా చాలా టైం ఉంది. నితిన్, ప్రభాస్ అన్న ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా. వాళ్లే నాకు ఇన్సిపిరేషన్. ఇప్పటివరకు పెళ్లి, ప్రేమ గురించి ఆలోచించలేదు. అదొక వేరే ప్రపంచంలా అనిపిస్తుంది. కానీ ఎప్పటికైనా చేసుకోవాలి కదా. ఏదో ఒక రోజు చేసుకుంటా. మెంటల్లీ నేను ఫిక్స్ అయినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటా.”

ఇలా ప్రేమ, పెళ్లిపై తన మనసులో అభిప్రాయాన్ని వెల్లడించాడు వరుణ్. ఈ హీరో నటించిన తొలిప్రేమ సినిమా తాజాగా వరల్డ్ వైడ్ 26 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ వసూళ్లు 10 కోట్లు దాటాయి. శివరాత్రి కారణంగా నిన్న ఒక్కరోజే నైజాంలో ఈ సినిమాకు కోటి రూపాయల షేర్ వచ్చింది.