బలవిస్తరణపై భాజపా కన్ను : సికె బాబుకు ఆహ్వానం !

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే.. స్థానికంగా తనకంటూ ప్రజాబలం ఉన్న నాయకుడు అయిన సికె జయచంద్రారెడ్డి (సికె బాబు) త్వరలో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారా? మంగళవారం నాటి పరిణామాలు ఇలాంటి సంకేతాలను ఇస్తున్నాయి. భాజపా నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి సికె బాబును స్వయంగా వెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.

సికె బాబు తనకు ఎంతో కాలంగా పరిచయస్తులు అని పురందేశ్వరి చెబుతున్నప్పటికీ.. భాజపాలోకి రావాల్సిందిగా ఆహ్వానించడానికే ఆమె కలిసి ఉంటారనే ప్రచారం షురూ అయింది. చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ నాయకుల్లో ఒకప్పుడు చెలరేగిన సికె బాబు … ఇప్పుడు తెదేపాకు మిత్రపక్షం అయిన భాజపాలో చేరితే గనుక.. అది విశేషమే.

సికె జయచంద్రారెడ్డి.. ముఠా రాజకీయాలు విచ్చలవిడిగా ఉండే చిత్తూరులో తనకంటూ గట్టిబలం ఉన్న నేత. కాంగ్రెస్ పార్టీలో ఉండగా… వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుల్లో ఒకరు. గతంలో ఆయనపై పలుమార్లు హత్యాప్రయత్నాలు కూడా జరిగాయి. ఆయన మీద అనేక నేరారోపణలు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్ మరణం తర్వాత.. జగన్ కు కాస్త సన్నిహితంగానూ మెలిగారు.

అయితే అప్పట్లో పార్టీ టికెట్ గురించి జగన్ హామీ ఇవ్వకపోవడంతో వైకాపాలో చేరలేదు. ఇటీవల కొంతకాలం కిందట.. చిత్తూరు వైకాపా కార్యాలయంలో సికె బాబు మనుషులు హల్ చల్ చేశారు. తమ పార్టీ అంటూ హడావిడి చేశారు. దీనిని వైకాపా ఖండించింది. సికె బాబుకు తమ పార్టీకి సంబంధంలేదని, ఆయన ఎన్నడూ తమ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదని వైకాపా అధికారికంగా ప్రకటించింది. అప్పటినుంచి ఆయన ఏ పార్టీతోనూ ప్రమేయం లేకుండా స్తబ్ధుగానే ఉన్నారు.

అయితే గత కొంతకాలంగా ఆయనను భాజపాలోకి తీసుకురావడం గురించి మంతనాలు సాగినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆ పార్టీ చాలాకాలం నుంచి చెబుతూనే ఉంది. అయితే వారి ప్రయత్నాలు ఏవీ నికరంగా మొదలు కాలేదు. సికె బాబుతోనే దీనికి శ్రీకారం అవుతుందని పలువురు అనుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ నిరాకరించినప్పుడు కూడా ఇండిపెండెంటుగా బరిలోకి దిగి విజయం సాధించి, తర్వాత పార్టీతో కలిసి పనిచేసిన చరిత్ర సికె బాబుకు ఉంది. ఆయనను పార్టీలో చేర్చుకోవడం భాజపాకు లాభసాటి అవుతుందనే పలువురు నాయకులు భావిస్తున్నారు.

అయితే భాజపా మామూలుగా తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి విస్తరించడానికి శ్రద్ధ పెట్టడం వేరు. చంద్రబాబునాయుడు సొంతజిల్లాలో, చంద్రబాబు అంటే ఒంటికాలిపై లేచే చిరకాల శత్రువు సికె బాబును అక్కున చేర్చుకుంటూ తమ విస్తరణ ప్రయత్నాలను ప్రారంభించడంలో ఏదో అంతరార్థం ఉన్నదనే పలువురు భావిస్తున్నారు.