బాబు మెప్పు కోసం కోడెల అత్యుత్సాహం

‘అనర్హత వేటు’ అంశం స్పీకర్‌ పరిధిలోనిది. ఇది జగమెరిగిన సత్యం. స్పీకర్‌కి వున్న విశేషాధికారాల్ని ఎవరూ ప్రశ్నించలేరు. చివరికి న్యాయస్థానాలు కూడా.! ఇదీ, అధికారంలో వున్న పార్టీలు చెప్పే వాదన. పేరుకి విశేషాధికారాలనేవి స్పీకర్‌ చేతుల్లో వున్నట్లు చెబుతుంటారుగానీ, ఆ విశేషాధికారాలన్నీ అధికార పార్టీలకు చెందినవే. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు.!

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు జరిగాయి.. అనర్హత వేటు ఫిర్యాదులూ వచ్చాయి. తెలంగాణ శాసనసభలో టీడీఎల్పీ, ఏకంగా టీఆర్‌ఎస్‌లో విలీనమైపోయినట్లు ప్రకటించేశారు. అదెలా సాధ్యం.? అని అంతా ముక్కున వేలేసుకున్నాసరే.. అదంతే.! చిత్రంగా, ఇక్కడ స్పీకర్‌ మధుసూధనాచారిపై విమర్శలు చాలా తక్కువగానే వచ్చాయి. ఎందుకంటే, అక్కడ వ్యవహారం నడిపించేది అధికారపక్షమనీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కనుసన్నల్లోనే జరుగుతోందనీ అందరికీ తెలుసు గనుక. స్పీకర్‌ అధికారాల్ని, అధికార పార్టీ అంత ‘గొప్పగా’ ఉపయోగించుకుంటోందక్కడ.

పార్టీ ఫిరాయింపులు – తెలంగాణలో అయితే రాజకీయ వ్యభిచారం. అదే పార్టీ ఫిరాయింపుల వ్యవహారం, ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేసరికి మాత్రం ‘అభివృద్ధి మంత్రం’. ఇదీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారి ఉవాచ. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పార్టీ ఫిరాయించి, తెలంగాణలో మంత్రి అయితే టీడీపీ టీమ్‌ నానా యాగీ చేసింది. కానీ, ఏపీలో చంద్రబాబు ఏం చేశారు.? పార్టీ ఫిరాయించిన నలుగురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చారు.

అటు తెలంగాణ అసెంబ్లీలో అయినా, ఇటు ఏపీ అసెంబ్లీలో అయినా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కితే, మారిన కండువాలేసుకుని మిగతా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కలియతిరుగుతోంటే, ‘స్పీకర్‌’ వ్యవస్థ న్యాయదేవత తరహాలో ‘కళ్ళు మూసుకుని’ అచేతనావస్థలో వుండిపోయిందన్న విమర్శలు ప్రజాస్వామ్యవాదుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ స్పీకర్‌ మధుసూధనాచారి ఎక్కడా తొందరపడి వ్యాఖ్యలు చేయలేదు.

కానీ, ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ మాత్రం తొందరపడ్తున్నారు. తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఆరాటపడ్తున్నారు. వైఎస్సార్సీపీ న్యాయస్థానాల్ని ఆశ్రయించి వుండకపోతే.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా విషయమై న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ గౌరవించిందా.? లేదే.! అలాంటప్పుడు, సుప్రీంకోర్టుని వంకగా చూపించడమేంటట.? కోడెల అడ్డంగా బుక్కయిపోయారిక్కడ.

నిజానికి, కోడెల ఇలా బుక్కయిపోవడం ఇదే కొత్తకాదు. ఆయనెప్పుడూ స్పీకర్‌లా వ్యవహరించలేదు, టీడీపీ నేతగానే ఆయన వ్యవహార శైలి వుంటోందనడానికి చాలా సందర్భాలు నిదర్శనాలుగా నిలిచాయి. వర్షానికి ప్రతిపక్ష నేత ఛాంబర్ లోకి నీళ్ళు వచ్చేస్తే, అదేదో కుట్ర.. అని ముందే తొందరపడి ప్రకటించేసిన కోడెల, ఆ ఘటనపై విచారణకు ఆదేశించేశారు సరే, ఆ విచారణ ఏమయ్యిందట.? నో ఆన్సర్. ఇవే తొందరపాటు వ్యవహారాలు. ‘నో కామెంట్‌’ అనేసి, కాస్తో కూస్తో గౌరవం నిలుపుకోవాల్సిన కోడెల, అత్యుత్సాహానికి పోయి, ఇంకా అడ్డంగా దొరికిపోతున్నారు.