బాబూ.. నీ ‘త్యాగం’ సల్లంగుండ.!

మీకు తెలుసా.? దీపావళి పండక్కి, మనవడితో కలిసి ఎంజాయ్‌ చేసే అవకాశాన్ని కాదనుకుని, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. కేవలం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా విదేశాల్లో పర్యటించాల్సి వస్తోంది.! నిజ్జంగా నిజమిది. దేవుడా.! రాజకీయాల్లో ఇలాంటోళ్ళు కూడా వుంటారా.? అని ఆశ్చర్యమేస్తోంది కదూ.! దటీజ్‌, ‘నిప్పు’ నారా చంద్రబాబునాయుడు.

చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళితేనేం, ఎంచక్కా మనవడ్ని వెంటేసుకుని వెళ్ళొచ్చు కదా.? అన్న డైట్‌ మీకు రాకూడదంతే. అలా ప్రశ్నించారో, మీరు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అడ్డు పడుతున్నట్లే లెక్క. ఎందుకంటే, అక్కడున్నది ‘త్యాగం’ అనే పదానికి నిలువెత్తు అర్థం.. ఆయనే, ‘నిప్పు’ నారా చంద్రబాబునాయుడు.

నిన్న మొన్నటిదాకా ఒక లెక్క.. ఇప్పుడు ఇంకో లెక్క. ‘నేను విజయవాడలో, నా మనవడు హైద్రాబాద్‌లో.. నా కష్టం పగవాడిక్కూడా రాకూడదు.. కేవలం, రాష్ట్రాభివృద్ధి కోసమే, కుటుంబంతో అనుబంధాలకు దూరంగా వుండాల్సి వస్తోంది..’ అంటూ నిన్న మొన్నటిదాకా కథలు చెప్పిన చంద్రబాబు, ఇప్పుడిలా విదేశీ పర్యటనలోనూ ‘మనవడి’ పేరుతో సెంటిమెంట్‌ని, సింపతీనీ తన ఖాతాలో వేసుకోవడానికి చూస్తున్నారు.

రాజకీయమంటేనే నిజానికి త్యాగం. ఆ ‘త్యాగం’ నేటి రాజకీయాల్లో కన్పించదు. ఓ వైపు వ్యాపారం, ఇంకో వైపు రాజకీయం. ‘ఏం, రాజకీయాల్లో వుంటే మాత్రం వ్యాపారాలు చేసుకోకూడదా.?’ అని ప్రశ్నించేంత గడుసుదనం రాజకీయ నాయకుల్లో బాగా పెరిగిపోయింది. చంద్రబాబు అండ్‌ కో రాజకీయాల్లో ‘త్యాగం’ ఎంత గొప్పగా చేసేస్తోందో, తాజాగా తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డే చెప్పేశారాయె. టీఆర్‌ఎస్‌తో టీడీపీకి రాజకీయ పంచాయితీ నడుస్తోంది. కానీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంలోని పెద్దలకి ‘కాంట్రాక్టులు’ అప్పగించేస్తోంది. ఇదిగో, ఈ ‘రాజకీయ అరాచకం’ నుంచి జనం దృష్టి మళ్ళించడానికి, చంద్రబాబు తన మనవడ్ని ‘సెంటిమెంట్‌’లోకి లాగేశారన్నమాట. అద్గదీ అసలు విషయం. ఇదీ, చంద్రబాబు ‘త్యాగం’.!