బిగ్ రిలీఫ్..ఆ 9 వేల మంది దొరికారు

దేశవ్యాప్తంగా గత రెండు రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న మర్కస్ మస్జిద్ లో జరిగిన సదస్సుకు హాజరైనా వారిలో ఎక్కువమంది కరోనా బారిన పడడంతో కేంద్రం రంగంలోకి దిగింది. మర్కస్ మస్జిద్ ను ఖాళీ చేయించడంతోపాటు అక్కడున్న వారందరినీ క్వారంటైన్ కు తరలించింది. అయితే, ఈ సదస్సులో పాల్గొని వివిధ రాష్ట్రాలకు వెళ్లిన వారిని, వారితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేసింది.

తాజాగా, ఆ సదస్సుకు హాజరైన వారిని కేంద్రం గుర్తించింది. తబ్లిగ్ జమాత్ నిర్వహించిన సదస్సుకు హాజరైన వారితో పాటు వారిని కాంటాక్ట్ అయిన 9000 మందిని గుర్తించామని కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ వాస్తవ వెల్లడించారు. వారిలో 1306 మంది విదేశీయులని, మిగతా వారంతా భారత్ లోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారని తెలిపారు.

గుర్తించిన వారందరినీ క్వారంటైన్ లో ఉంచామని, వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఢిల్లీలో 2000 మందిని గుర్తించామని, వారిలో 250 మంది విదేశీయులని, మిగతా 1804 మందిని క్వారంటైన్ కు తరలించామని తెలిపారు. 334 మందిని ఆసుపత్రుల్లో చేర్పించామని చెప్పారు.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంలో కేంద్ర హోం శాఖ వీరందరినీ చాలా తక్కువ సమయంలో గుర్తించిందని చెప్పారు. సదస్సుకు హాజరైన వారిలో 275 మంది విదేశీయులు నిజాముద్దీన్ ప్రాంతంలోని వివిధ మసీదులలో ఉన్నారని, వారందరినీ ఢిల్లీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ గుర్తించి క్వారంటైన్ కు తరలించారని చెప్పారు. కాగా, ఢిల్లీలో సదస్సు నేపథ్యంలో కరోనా కేసులు పెరగడంపై కేంద్రం సీరియస్‌గా ఉంది.

సదస్సుకు హాజరైన విదేశీయుల సమాచారాన్ని సేకరించిన కేంద్ర ప్రభుత్వం.. వారి వివరాలను ఆయా దేశాలకు అందించింది. ఆయా దేశాలకు సంబంధించిన దౌత్యవేత్తలకు భారత విదేశాంగ శాఖ ఈ వివరాలు అందజేసింది. టూరిస్ట్ వీసాలపై వచ్చి మతప్రచారంలో పాల్గొన్నారని కేంద్రం వారికి వివరించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయా దేశాల దౌత్యవేత్తలకు తెలియజేసింది. ఈ రకంగా వారంతా వీసా నిబంధనలు ఉల్లంఘించారని భారత్ విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.