బీజేపీతో వైఎస్‌ జగన్‌: డిఫరెంట్‌ బాల్‌ గేమ్‌.!

ప్రత్యేక హోదా ఇస్తే, భారతీయ జనతా పార్టీతో కలిసి ముందడుగు వేసేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సిద్ధంగా వున్నారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసేశారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీతోనే కాదు, అవసరమైతే పవన్‌కళ్యాణ్‌తో సైతం కలిసి నడిచేందుకు సిద్ధంగా వున్నట్లు వైఎస్‌ జగన్‌ ప్రకటించడం విశేషమే మరి.!

అయితే, పవన్‌ మీద జగన్‌కి పెద్దగా నమ్మకాల్లేవు. చంద్రబాబు షెల్‌లోంచి పవన్‌ బయటకు రాలేరనీ, వస్తే ఆ తర్వాతి రాజకీయం వేరేలా వుంటుందని జగన్‌ చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్రమోడీని కలిసినప్పుడే బీజేపీతో కలిసి నడిచే విషయమై చర్చ జరిగిందని వైఎస్‌ జగన్‌ అంటున్నారు. ప్రత్యేక హోదా – బీజేపీతో కలిసి నడిచే విషయమై జరిగిన చర్చల సందర్బంగా ప్రధాని నరేంద్రమోడీ సానుకూలంగా స్పందించారని జగన్‌ చెప్పడంతో ఏపీ రాజకీయాల్లో దీన్నొక సూపర్‌ ట్విస్ట్‌గా అభివర్ణించాలేమో.!

కేంద్రం నుంచి ప్రత్యేక హోదాకి అనుకూలంగా సానుకూల సంకేతాలు అయితే లేవు. నిజానికి, ప్రత్యేక హోదాని ప్రధాని నరేంద్రమోడీ ఎప్పుడో పాతరేసేశారు. దేశంలో కొత్తగా ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదనీ, ఇప్పుడు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకీ, ఆ హోదాని తొలగిస్తామనీ కేంద్రం గట్టిగా చెబుతోన్న విషయం విదితమే. మరి, ఈ పరిస్థితుల్లో జగన్‌ ఇంకా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కి వస్తుందనీ, అదీ బీజేపీ ద్వారానే సాధ్యమవుతుందని ఆశించడం అత్యాశే అవుతుందేమో.!

రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనే బీజేపీకి ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించేశారు వైఎస్‌ జగన్‌. అది ఆఫర్‌ కాదు, గంపగుత్తగా ‘సోల్డ్‌’ అయిపోయారన్న విమర్శలూ ఎదుర్కోవాల్సి వచ్చింది వైఎస్సార్సీపీ. జగన్‌, తన పార్టీని బీజేపీకి సమర్పించేయడంతోనే రాజకీయంగా కొంత వెసులుబాటు పొందారన్న ఆరోపణలు టీడీపీ నుంచి విన్పిస్తున్నాయి. ఈ తరహా ఆరోపణలు రాజకీయాల్లో సహజమే. పైగా, కేంద్రం ఏం చెప్పినా, తలాడిస్తోన్న టీడీపీ నుంచి ఈ ఆరోపణలు ఇంకా సర్వసాధారణంగా భావించాల్సి వుంటుందేమో.!

ఒక్కటి మాత్రం నిజం.. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, రైల్వే జోన్‌, పోలవరం వంటి విషయాల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ని నట్టేట్లో ముంచేసినా.. భారతీయ జనతా పార్టీ అంటే, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన రాజకీయ పార్టీలకీ, ముఖ్యంగా ఆయా పార్టీల అధినేతలకీ బీజేపీ అంటే అదో ఇది. అది నరేంద్రమోడీ ఘనత అనుకోవాలో, అందర్నీ అలా ఆయన కబంధ హస్తాల్లో ఇరికించేస్తున్నారనాలో అర్థం కాని పరిస్థితి.