బెజవాడ మెట్రోను ఇక మరచిపోవడమే!

చంద్రబాబు నాయుడు ఏ పనుల విషయంలో దూకుడు ప్రదర్శిస్తారో … ఏ పనుల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తారో.. అలా ఎందుకు చేస్తుంటారో… ఒక పట్టాన అర్థం చేసుకోవడం కష్టం. ఒకవైపు నిధుల లేమితో.. పనులు వేగంగా జరిగే అవకాశం లేని పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రతి సోమవారం సమీక్ష సమావేశాలు పెట్టి.. ఏదో హడావిడి చేస్తుంటారు.

మరోవైపు రాజధానికి ప్రజారవాణా హంగుల్లో ఒక కీలకాంశం అయినటువంటి బెజవాడ మెట్రో వంటి పనుల విషయంలో కేవలం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం కారణంగా.. నిధులు అందుకునే అవకాశాన్ని కూడా చేజారుస్తుంటారు. ఆరకమైన చంద్రబాబు ప్రభుత్వపు క్రమపద్ధతి లేని పరిపాలన వల్ల.. రాష్ట్రం 2000 కోట్ల కేంద్ర నిధులను పొందే అవకాశాన్ని కోల్పోయింది. తాజా పరిస్థితిని సూటిగా చెప్పాలంటే.. ఇక ఆ నిధులు వచ్చే అవకాశం కూడా లేదు. మనకు కాస్త చేదుగా అనిపించినా.. (కొత్తగా ప్రభుత్వం ఏదైనా మరో మార్గం చూస్తే తప్ప) బెజవాడ మెట్రో ఇక కలే!

మెట్రో రైలు అనే వ్యవస్థతో అచ్చంగా వ్యాపారంలాగా చేసేసి లాభాలు సంపాదించేద్దాం అనుకోవడం మాత్రం అసాధ్యం. ప్రపంచంలో ఇప్పటిదాకా లాభాలు ఆర్జిస్తున్న మెట్రో రైలు వ్యవస్థలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినన్ని కూడా లేవని చాలా సందర్భాల్లో నిపుణులు చెబుతున్నారు. ప్రజారవాణాకు అనుకూలంగా ఉండే వ్యవస్థగా గుర్తింపు ఉన్నదే తప్ప.. లాభాలు ఆర్జించే వ్యాపారంగా మెట్రో రైల్ వ్యవస్థకు ఎప్పుడూ గుర్తింపులేదు.

అయితే బెజవాడ మెట్రో రైలుకు సంబంధించి.. రాష్ట్రప్రభుత్వం ముందు సరిగానే స్పందించింది. లాభనష్టాలతో నిమిత్తం లేకుండా భవిష్యత్ అవసరాలకు సరిపడా మెట్రో ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. అయితే వీరు ప్లాన్ చేసిన ప్రకారం.. విదేశీ సంస్థల నుంచి రుణాల్ని తెచ్చుకోవడం విఫలం అయ్యారు. దానికి తగ్గట్లుగా మెట్రో- లైట్ మెట్రో- ఎలివేటెడ్ ఎలక్ట్రిక్ బస్ లు ఇలా రకరకాల ప్రత్యామ్నాయాల గురించి కసరత్తు పేరుతో సమయం వృథా చేశారు.

మొత్తానికి ఈ జాప్యం వల్ల.. కేంద్రానికి ప్రతిపాదనలు సకాలంలో వెళ్లక, అక్కడినుంచి రావాల్సిన 2000 కోట్ల నిధులను పొందలేకపోయారు. ఈలోగా కేంద్రం మెట్రో కుసంబంధించిన నిబంధనల్ని మార్చేసింది. ఇప్పుడసలు బెజవాడ మెట్రో వర్కవుట్ కాని వ్యవహారం అంటూ తోసిపుచ్చేసింది. ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించేలా.. కొత్త ప్రతిపాదనల్ని సిద్ధం చేయాలి.. మెట్రో ద్వారా రాబడికి కనీస ప్రమాణాలుగా కేంద్రం ఎంచుకున్న మోతాదుకు మించి లాభాలను గణించేలా కొత్త ప్రతిపాదనలు ఉండాలి. అయితే ఈ దిశగా నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం చురుగ్గా కదలడం లేదు.

లైట్ మెట్రో అనే వ్యవస్థ తక్కువ ఖర్చులో అయిపోయే అవకాశం ఉంది. పైగా దానికి సాంకేతిక ప్రతిబందకాలు తక్కువ.. దానికి రుణం ఇవ్వడానికి సంస్థలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే వందేళ్ల భవిష్యత్ అవసరాలు అంటూ పడికట్టు మాటలతో ఇంకా జాప్యం జరుగుతోంది. బెజవాడెకు మెట్రో అన్నది కలగానే మారగా.. లైట్ మెట్రో విషయంలోనైనా జాగులేకుండా ప్రవర్తిస్తే తప్ప.. అది కూడా అటకెక్కుతుంది.