బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ బాడీగార్డులు కృత్రిమ చేతులతో చేసేది ఇదేనా?

బ్రిటన్ కు 70 ఏళ్లు బ్రిటిష్ రాణిగా ఉన్న ఎలిజబెత్ -2 ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె స్థానంలో ఎలిజబెత్ -2 కుమారుడు చార్లెస్ బ్రిటన్ రాజు అయ్యారు. ప్రస్తుతం బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియల కోసం వివిధ దేశాల నుంచి 500 మంది అతిథులు బ్రిటన్కు చేరుకున్నారు. మనదేశం నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమెరికా అధినేత జోబైడెన్ దంపతులు సహా ప్రపంచంలో వివిధ దేశాల నుంచి అధ్యక్షులు ప్రధానమంత్రులు తదితరులు ఇప్పటికే బ్రిటన్ రాజధాని లండన్ చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో బ్రిటన్ కొత్త రాజు.. కింగ్ చార్లెస్ 3 బాడీగార్డులకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో వింత ఏముందా అంటారా? అవి సాధారణ చేతులు కాదు.. కృత్రిమ చేతులు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముందుగా ఒక విదేశీ టిక్టాకర్ బాడీగార్డుల చేతులను జూమ్ చేస్తూ ఒక వీడియోను తన టిక్టాక్ ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో అవి సాధారణ చేతులు కావని.. కృత్రిమ చేతలని అని చర్చ నడుస్తోంది. అలాగే మరికొంతమంది బాడీగార్డుల చేతులను చాలా దగ్గరగా ఫొటోలు వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొంతమంది ఇవి కృత్రిమ చేతులని అభిప్రాయపడుతుండగా మరికొంతమంది ఇవి సాధారణ చేతులేనని చెబుతున్నారు.

వీటిని చూసిన నెటిజన్లు బాడీగార్డులు కృత్రిమ చేతులు ఉపయోగిస్తున్నారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల అసలు చేతులను కోటు లోపల దాచుకుని ఫేక్ చేతులను బయటకు ప్రదర్శిస్తున్నారా? అని చర్చ జరుగుతోంది.

అయితే దీనికి సంబంధించి ఒక ఆసక్తికర వాదన వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బ్రిటన్ రాజ కుటుంబం తదితర ప్రపంచంలోనే ముఖ్య వ్యక్తులకు భద్రత కల్పించేటప్పుడు బాడీగార్డులు చాలా అప్రమత్తంగా ఉంటారని అంటున్నారు. అందుకే వారు ఇలాంటి టెక్నిక్స్ను పాటిస్తూ తమ నేతలను కాపాడుతుంటారని చెబుతున్నారు. అలాంటి టెక్నికుల్లో ఒకటి.. ఈ ఫేక్ చేతులు కూడా అని పేర్కొంటున్నారు.

వారి ఫేక్ చేతులు బయటకు ఉన్నా.. తాము ధరించిన సూట్ లోపల జేబులో అసలు చేతులు ఉంటాయని అంటున్నారు. ఆ అసలు చేతుల్లో హ్యాండ్ గన్స్ ఉంటాయని.. తమ నేతలకు రక్షణపరమైన సమస్యలు తలెత్తినప్పుడు వారి అసలు చేతులను సెక్యూరిటీ గార్డులు వినియోగిస్తున్నారని చెబుతున్నారు.

కాగా ఈ ఫేక్ చేతుల విషయం ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది కూడా కాదంటున్నారు. గతంలో 2017లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు రక్షణగా ఉన్న సీక్రెట్ సర్వీస్ బాడీగార్డు తన చిటికెన వేలును వింతగా పట్టుకున్నాడట. అప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ చిటికెన వేలు అతడు పట్టుకున్న చేయి రెండు వేర్వేరుగా ఉండటమే ఇందుకు కారణం.

బాడీగార్డులు ఇలా కృత్రిమ చేతులు ధరించినప్పుడు కోట్ లోపల అసలు చేతులతో ఆటోమేటిక్ హ్యాండ్ గన్ తో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారని అంటున్నారు. ఇలా కోటు లోపల జేబుల్లో అసలు చేతులు దాచుకున్న సందర్భాల్లో ఎఫ్ఎన్-పీ90 గన్ను చేతిలో ఉంచుకుంటారట. ఎవరికీ అనుమానం రాకుండా కోటు లోపల పెట్టుకుని తమ నేతలకు భద్రత కల్పించేందుకు ఇది అనువుగా ఉంటుందని చెబుతున్నారు.

అయితే నిబంధనల ప్రకారం.. బ్రిటన్ రాజ కుటుంబానికి భద్రత కల్పించే వ్యక్తులు ఆయుధాలు కలిగి ఉండటానికి అనుమతులు లేవు. ఈ నేపథ్యంలో కింగ్ చార్లెస్ 3 బాడీగార్డులు కూడా కోటు లోపల అసలు చేతులు పెట్టుకునే అవకాశాలే లేవంటున్నారు. అలాగే నిబంధనల ప్రకారం.. వారి చేతుల్లో గన్స్ ఉండటానికి అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు వీడియోలు మాత్రం నెటిజన్లను అయోమయానికి గురి చేస్తున్నాయని అంటున్నారు. అసలు బాడీగార్డులు కృత్రిమ చేతులు నిజంగానే ధరించారా? లేక వీడియోలు ఫొటోలతో కనికట్టు చేస్తున్నారా అనే అంశంపై స్పష్టత రావడం లేదు.

నెటిజన్లలో ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొందరేమో కింగ్ చార్లెస్ బాడీగార్డులు కచ్చితంగా కృత్రిమ చేతులు ధరించారు అంటుంటే.. మరికొందరేమే ఇవి ఫేక్ చేతుల్లా లేవని అంటున్నారు. అయితే ఈ విషయంపై బాడీగార్డులు కూడా నిజాన్ని చెప్పే అవకాశం లేదంటున్నారు. ఎందుకంటే అసలు విషయం తెలిస్తే కింగ్ చార్లెస్ భద్రతకు ముప్పు ఉంటుందని వారు భావించడమే ఇందుకు కారణం.