భయమొద్దు.. ఉద్ధరించేస్తున్నాం: అరుణ్‌ జైట్లీ

వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పేటోడు రాజకీయ నాయకుడు.. అని చెప్పుకోవాలి ఇకపైన. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, దేశ ఆర్ధిక వ్యవస్థ విషయమై ఈ రోజు పెద్ద క్లాసే పీకారు మీడియా సమావేశంలో. దేశ ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదనీ, ఆర్థిక వ్యవస్థపై భయం అక్కర్లేదనీ, పెద్ద నోట్ల రద్దు – జీఎస్‌టీ వంటి సంస్కరణలు దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయనీ సెలవిచ్చారు.

2017 నవంబర్‌ 8వ తేదీ వస్తే, పెద్ద పాత నోట్ల రద్దు జరిగి ఏడాది పూర్తవుతుంది. 2016 నవంబర్‌ 8న పెద్ద పాత నోట్ల రద్దు నిర్ణయం అమల్లోకి వచ్చింది. ప్రధాని నరేంద్రమోడీ బహు గొప్పగా, పెద్ద పాత నోట్ల రద్దు విషయాన్ని అర్థరాత్రి ప్రకటించిన విషయం విదితమే. జనం ఏటీఎంల వద్దకు పరుగులు తీయడం, రాత్రికి రాత్రి దేశం తీవ్ర భయాందోళనలకు గురవడం తెల్సిన విషయాలే.

పెద్ద పాత నోట్ల రద్దు దెబ్బకి అధికారికంగానే 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు దేశవ్యాప్తంగా. ఏటీఎంల దగ్గర క్యూలైన్లలో నిల్చోలేక, బ్యాంకుల ముందు పడిగాపులు కాయలేక ప్రాణాలు కోల్పోయినవారి సంగతి ఇది. పెద్ద నోట్ల రద్దు దెబ్బకి, ఆర్థికంగా కుదేలైపోయి ఎంతమంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారో, ఇంకెంతమంది ఉపాధి కోల్పోయి ప్రాణాలు తీసుకున్నారో అది లెక్కకే అందనంత దారుణం.

ఇంతా చేసి, నరేంద్రమోడీ చెప్పినట్లు పెద్ద పాత నోట్ల రద్దుతో దేశంలో అవినీతి తగ్గిందా.? నల్లధనం మటుమాయమైందా.? తీవ్రవాదం అంతమొందిందా.? అంటే, లేదనే చెప్పాలి. బ్యాంకులు దివాళా తీసే పరిస్థితికి వచ్చేశాయి. దాంతో, ఛార్జీల్ని పెంచేసి బ్యాంకుల్ని నిలబెట్టేదిశగా కేంద్రం ప్రయత్నించడం, అది మళ్ళీ సామాన్యుడి నడ్డి విరిచేయడం తెల్సిన విషయమే.

దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా తయారవడం, దానికి తోడు ‘ఆకలి కేకల్లో’ ప్రపంచంలోనే అత్యంత దారుణమైన స్థితికి దేశం నెట్టివేయబడడం.. ఇలాంటి అద్భుతాలన్నీ గడచిన ఏడాది కాలంలోనే చూశాం. జీఎస్‌టీ దెబ్బకి దేశ ఆర్థిక పరిస్థితి మరీ దిగజారిపోయింది. జీఎస్‌టీ పేరుతో చిన్న వ్యాపారుల్లో కొందరు చితికిపోతే, మరికొందరు అతి తెలివితో సామాన్యుల్ని నిలువు దోపిడీ చేసేస్తున్నారు. జీఎస్‌టీ అంటే అదో జడపదార్థంలా తయారయ్యిందిప్పుడు.

అయినాసరే, దేశ ప్రజానీకం ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోయినా.. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయినా.. అన్నిటినీ తట్టుకోవడానికి కేంద్రం సిద్ధంగా వుంది. పాలకులెప్పుడూ సిద్ధంగానే వుంటారు.. వాళ్ళకి పోయేదేముంది.? నష్టపోయేది జనం కదా.! పెద్ద పాత నోట్ల రద్దు దెబ్బకి ఒక్క రాజకీయ నాయకుడైనా ప్రాణాలు కోల్పోయాడా.? 250 మంది సామాన్యులెందుకు ప్రాణాలు కోల్పోయారు.? ఏ రాజకీయ నాయకుడూ ఎందుకు బ్యాంకుల వద్దనో, ఏటీఎం క్యూ లైన్ల వద్దనో కన్పించలేదు.? మిస్టర్‌ జైట్లీ.. ఆన్సర్‌ దిస్‌ క్వశ్చన్స్‌ ప్లీజ్‌.!