భావోద్వేగాల ‘జూలీ’ అసలు కథ.!

లక్ష్మీ రాయ్‌ అలియాస్‌ రాయ్‌ లక్ష్మీ నటించిన ‘జూలీ-2’ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. నిజానికి, ఈ సినిమా ఈపాటికే విడుదల కావాల్సి వున్నా, కొన్ని అనివార్య కారణాలతో విడుదల ఆలస్యమయ్యింది. నవంబర్‌ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ‘జూలీ-2’ సినిమాకి విపరీతమైన హైప్‌ క్రియేట్‌ అయ్యిందంటే, అందుక్కారణం సినిమా ప్రమోషన్స్‌లో లక్ష్మీ రాయ్‌ని చాలా గ్లామరస్‌గా చూపించెయ్యడమే.

ఇంతకీ, ‘జూలీ-2’ సినిమాలో ఏముంటుంది.? అన్న ప్రశ్నకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చిన లక్ష్మీ రాయ్‌, ఇంతకు ముందెన్నడూ ఏ సినిమాలోనూ తాను చూపించని భావోద్వేగాలు ఈ సినిమాలో వుంటాయని చెప్పింది. ‘నా సినిమాల్లోనే కాదు, బావోద్వేగాల పరంగా చూస్తే, ఇది చాలా ప్రత్యేకమైన సినిమా.. సింపుల్‌గా చెప్పాలంటే, ఇదొక సుగర్‌ కోటెడ్‌ పిల్‌ అనొచ్చేమో..’ అని నవ్వేసింది లక్ష్మీ రాయ్‌.

అలాగని, ఇదేమీ ఏడుపుగొట్టు సినిమా కానే కాదనీ, అటు గ్లామర్‌నీ ఇటు పెర్ఫామెన్స్‌నీ పెర్‌ఫెక్ట్‌గా బ్లెండ్‌ చేసి, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో తెరకెక్కించిన సినిమా అని ‘జూలీ-2’ గురించి లక్ష్మీ రాయ్‌ చెప్పుకొచ్చింది. తెలుగు రాష్ర్టాలలో తెలుగు వెర్షన్‌, తమిళనాడులో తమిళ వెర్షన్‌, కేరళలో మలయాళ వెర్షన్‌ విడుదల కానుండగా, కర్నాటకలో మాత్రం హిందీ వెర్షన్‌ ‘జూలీ-2’ విడుదల కానుంది.