మళ్లీ పాత పద్ధతిలోకి తేజ

తేజ స్టయిల్ ఏంటనేది అందరికీ తెలిసిందే. తన సినిమాల్లో 90శాతం కొత్త ముఖాలే కనిపిస్తాయి. ఒకప్పుడు హీరోహీరోయిన్లను కూడా కొత్తవాళ్లనే పరిచయం చేసేవాడు. అలాంటి దర్శకుడు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో కాస్త మారాడనిపించింది. కాస్త పేరున్న, తెలిసిన ముఖాలే ఆ సినిమాలో కనిపించాయి. అయితే ఆ సినిమా సక్సెస్ తో మళ్లీ తన పాత పంథాలోకి తేజ వచ్చేసినట్టు కనిపిస్తోంది.

వెంకీ సినిమాతో ఈ దర్శకుడు మరోసారి భారీఎత్తున కొత్త ముఖాల్ని తెరపైకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడు. ఈ మేరకు కాస్టింగ్ కాల్ కూడా ఇచ్చేశాడు. ఆరేళ్ల ఛైల్డ్ ఆర్టిస్ట్ నుంచి 60ఏళ్ల ఓల్డ్-క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అన్నిరకాల నటీనటులు కావాలంటూ తన ఫేస్ బుక్ ఎకౌంట్ లో ప్రకటన ఇచ్చాడు తేజ. ఆ లిస్ట్ చూస్తే చాంతాడంత ఉంది.

ఇంకా చెప్పాలంటే సినిమాలో హీరో వెంకటేష్, హీరోయిన్ ను మినహాయిస్తే.. మిగిలిన వాళ్లంతా దాదాపు కొత్తవాళ్లే కనిపించే అవకాశం ఉంది. అంతమంది ఉన్నారు తేజ లిస్ట్ చూస్తే. ఎల్లుండి నుంచి 27వ తేదీ వరకు, రామానాయుడు స్టూడియోస్ లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ సెలక్షన్లు జరుగుతాయని ప్రకటించాడు తేజ.

ఈ లెక్కన నిర్మాతలు సురేష్ బాబు, అనిల్ సుంకరకు రెమ్యూనరేషన్ ఖర్చులు బాగానే తగ్గుతాయన్నమాట. అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి 26నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.