మళ్లీ మరోసారి అదే కాంబినేషన్

కుమారి 21ఎఫ్ తో టాలీవుడ్ లో డైరక్టర్ గా అడుగు పెట్టాడు సూర్య ప్రతాప్. అదే సినిమాతో మాంచి సేలబుల్ హీరో అనిపించుకున్నాడు రాజ్ తరుణ్. ఆ తరువాత రాజ్ తరుణ్ చకచకా సినిమాలు చేస్తున్నాడు కానీ, ప్రతాప్ కు మళ్లీ సరైన ప్రాజెక్టు సెట్ కాలేదు. ప్రతాప్ తో ఇంకో సినిమా చేస్తానని రాజ్ తరుణ్ ఎప్పుడో మాటిచ్చాడు. అయితే సబ్జెక్ట్ సెట్ కావడం లేదు. ఆఖరికి ఇప్పుడు అన్నీ కుదిరాయి.

చుట్టాలబ్బాయితో భాగస్వామిగా సినిమా రంగంలోకి వచ్చిన రామ్ తాళ్లూరి ఇప్పుడు సింగిల్ గా రెండు సిన్మాలు ప్లాన్ చేస్తున్నారు. అందులో ఒకటి మాస్ మహారాజా రవితేజ-కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో ఈ మధ్యనే అనౌన్స్ చేసారు. ఇప్పుడు ఇది రెండోది. రాజ్ తరుణ్-సూర్య ప్రతాప్ కాంబినేషన్ సినిమాను కూడా రామ్ తాళ్లూరినే టేకప్ చేసారు. రెండో ప్రాజెక్టుగా దీన్ని నిర్మిస్తారు.

అయితే ప్రస్తుతం రాజ్ తరుణ్ సినిమాలు రెండు ఆల్ మోస్ట్ పూర్తి కావచ్చాయి. వీటి తరువాత దిల్ రాజు నిర్మించే లవర్ స్టార్ట్ అవుతుంది. ఆ తరువాతే సూర్య ప్రతాప్ సినిమా వుంటుంది. లేదా సమాంతరంగా నిర్మిస్తారు.