మహానటిలో అదొక్కటే లోటు

సినిమాలో భారీ తారాగణం ఉంది. రాజేంద్రప్రసాద్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్లు ఉన్నారు. స్టార్ కాస్ట్ అంతా బాగా కుదిరింది. కానీ సీనియర్ ఎన్టీఆర్ విషయంలోనే మేకర్స్ మరో ప్రత్యామ్నాయం ఆలోచించి ఉంటే బాగుంటేది. ప్రేక్షకులను నిరాశకు గురిచేసిన అంశం ఏదైనా ఉందంటే అది పెద్ద ఎన్టీఆర్ పాత్ర మాత్రమే.

మహానటి సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ ను ప్రయత్నించారు. కానీ తాతగారిలా కనిపించడానికి, తాతగారి పాత్రల్ని పోషించడానికి తనకు అర్హత లేదని చెప్పి తప్పించుకున్నాడు ఎన్టీఆర్. తారక్ తప్పుకోవడంతో ఆ పాత్ర కోసం వేరే ఎవర్నీ సంప్రదించలేదు మేకర్స్. దీంతో గ్రాఫిక్స్ రూపంలో నటసార్వభౌముడ్ని చూపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్ పాత్రను ఒకే ఒక్క సీన్ కు పరిమితం చేశారు.

సేమ్ టైం, మహానటిలో ఏఎన్నార్ పాత్రకు మంచి స్కోప్ దొరికింది. తాత పాత్రలో యంగ్ ఏఎన్నార్ లా నాగచైతన్య భలే సెట్ అయ్యాడు. ఇచ్చినవి 2రోజుల కాల్షీట్లే అయినప్పటికీ సినిమాలో 7-8 సన్నివేశాల్లో బాగానే మెరిశాడు చైతూ. ఇలా చూసుకుంటే మహానటిలో ఎన్టీఆర్ కంటే ఏఎన్నార్ కే ఎక్కువ స్పేస్ దొరికినట్టయింది.

అదే ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా నటించి ఉంటే ఏఎన్నార్ కంటే ఎక్కువ సన్నివేశాలు ఎన్టీఆర్ క్యారెక్టర్ కే పడి ఉండేవి. సినిమాలో కీలకమైన పాత్రలన్నింటినీ చెప్పుకోదగ్గ నటులతో భర్తీచేసిన నాగ్ అశ్విన్.. ఒక్క ఎన్టీఆర్ పాత్రను మాత్రం రీప్లేస్ చేయలేకపోయాడు. తారక్ ను తప్ప వేరే ఎవర్నీ సంప్రదించలేదని ప్రకటించిన దర్శకుడు.. తప్పనిసరి పరిస్థితుల్లో డిజిటల్ రూపంలో పెద్ద ఎన్టీఆర్ ను ప్రజెంట్ చేశాడు.