మహేష్ లాగే బన్నీ కూడా..

తెలుగులో మరో పెద్ద సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నూతన దర్శకుడు వక్కంతం వంశీ రూపొందించిన ‘నా పేరు సూర్య’ మరి కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి.. రెండు వారాల కిందట విడుదలైన మహేష్ బాబు సినిమా ‘భరత్ అనే నేను’కు కొన్ని పోలికలు కనిపిస్తుండటం విశేషం. ఇవి రెండూ సమాజం పట్ల ఒక బాధ్యతతో.. ఒక సందేశాన్ని మిళితం చేసిన కథాంశాలతో తెరకెక్కిన సినిమాలు కావడం విశేషం.

‘భరత్ అనే నేను’లో హీరో ముఖ్యమంత్రి. జనాలకు మంచి చేయాలని తపిస్తాడు. ఇక ‘నా పేరు సూర్య’లో హీరో సైనికుడు. అతను దేశం కోసం.. దేశ ప్రజల కోసం ప్రాణాలివ్వాలని అనుకుంటాడు. వీళ్లిద్దరూ కూడా మంచి కోసం ఎక్కడికైనా వెళ్లేవాళ్లే. క్యారెక్టర్ అనేదాన్ని చాలా కీలకంగా భావిస్తారు ఈ హీరోలిద్దరూ.

‘భరత్ అనే నేను’లో ఒక ప్రామిస్ చేస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలని.. అందుకోసం ఎంత దూరమైనా వెళ్లాలంటాడు హీరో. ఇక ‘నా పేరు సూర్య’లో క్యారెక్టర్ పోతే ప్రాణం పోయినట్లే అంటాడు కథానాయకుడు. ఇలా రెండు పాత్రల విషయంలోనూ ఒక సిమిలారిటీ.. సిన్సియారిటీ కనిపిస్తోంది. ఈ రెండు చిత్రాల్లో కూడా వినోదానికి తక్కువ ప్రాధాన్యం ఉన్నట్లుంది. ఈ చిత్రాల దర్శకులు హానెస్ట్‌గా సీరియస్ సినిమాలు తీసే ప్రయత్నం చేశారు.

ఇది ఒక రకంగా ఆ చిత్రాలకు కొంచెం ప్రతికూలత అని కూడా చెప్పొచ్చు. ఈ తరహా సీరియస్ చిత్రాలకు రిపీట్ ఆడియన్స్ ఉండరు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా స్పందన తక్కువగానే ఉంటుంది. ఆ ప్రభావం ‘భరత్ అనే నేను’ మీద ఇప్పటికే కనిపించింది. మరి ‘నా పేరు సూర్య’ విషయంలో స్పందన ఎలా ఉంటుందో చూడాలి.