మహేష్ స్కూల్ ఓపెన్ చేశాడబ్బా..

హెడ్డింగ్ చూసి మహేష్ బాబు కొత్తగా స్కూల్ బిజినెస్‌ లోకి దిగాడేమో అనుకోకండి. ఇది మహేష్ బాబు తన తండ్రి కృష్ణ పుట్టిన ఊరికి చేసిన ఉపకారం. తాను తెర మీదే కాక నిజ జీవితంలోనూ ‘శ్రీమంతుడు’ని చాటుకుంటూ రెండేళ్ల కిందట మహేష్ గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.

తాజాగా ఆ ఊర్లో కొత్తగా ప్రాథమిక పాఠశాల నిర్మాణం పూర్తయింది. దాన్ని పిల్లలకు అందుబాటులోకి తెచ్చారు. మహేష్ బాబు నాయనమ్మ ఘట్టమనేని నాగరత్నమ్మ పేరుతో ఈ పాఠశాలను తెరిచారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఊర్లో సందడి నెలకొంది. మహేష్ సతీమణి నమ్రత బుర్రిపాలెంలో సేవా కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే అక్కడ అనేక సౌకర్యాలు సమకూర్చారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. మహేష్ ఆ ఊర్లో ఒకసారి పర్యటించాడు.

దీంతో పాటుగా మహేష్ తెలంగాణ ప్రాంతంలోని సిద్ధాపురం అనే గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్రామంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ సైతం మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకుని కోట్లాది రూపాయల ఖర్చుతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాడు. వీళ్ల స్ఫూర్తితో మిగతా సెలబ్రెటీలు కూడా గ్రామాల దత్తత బాధ్యత తీసుకుంటే బాగుంటుందేమో.