‘మీరా’ ప్రత్యేక హోదాపై మాట్లాడేది.?

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ, కాంగ్రెస్‌ పార్టీపైనే అసమ్మతి గళం విన్పించారు.. పైగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ, అవేమీ అప్పటి లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ పరిగణనలోకి తీసుకోలేదు. పార్లమెంటు తలుపులు మూసేసి, మైక్‌లు కట్‌ చేసేసి, లైవ్‌ ప్రసారాలు నిలిపివేసి.. ‘విభజన బిల్లు’ని పాస్‌ చేయించారు. అంతేనా, వ్యవహారం ఇంకా చాలానే వుంది. సభలో ఏపీ ఎంపీలపై ఉత్తరాది ఎంపీలతో దాడి చేయించింది కాంగ్రెస్‌ పార్టీ. ఈ మొత్తం ఎపిసోడ్‌కి అప్పటి స్పీకర్‌ మీరాకుమార్‌ ప్రత్యక్ష సాక్షి.

కానీ, ఇప్పుడామె ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తూ, ‘ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని నిలదీయండి..’ అంటూ రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిస్తున్నారు. తనను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు దత్తపుత్రికలా భావించాలంటున్నారు. ‘జై సమైక్యాంధ్ర’ అన్నందుకు అప్పట్లో లోక్‌సభలోనే ఏపీకి చెందిన ఎంపీలు చావు దెబ్బలు తినాల్సి వచ్చింది. స్పీకర్‌గా మీరాకుమార్‌ ఆ ఘటనపై ఏం చర్యలు తీసుకున్నారట.? ఇప్పుడామెను ఏ కోణంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు దత్త పుత్రికగా భావించాలట.?

‘ప్రత్యేక హోదా గురించి నినదించండి, చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురండి..’ అంటూ మీరాకుమార్‌ అలవోకగా పొలిటికల్‌ డైలాగులు పేల్చేశారు. అఫ్‌కోర్స్‌, కాంగ్రెస్‌ నేతల నోట ఇంతకన్నా ‘గొప్ప’ మాటలు వచ్చే అవకాశమే లేదనుకోండి.. అది వేరే విషయం. ఇప్పుడు ప్రత్యేక హోదా పేరుతో కాంగ్రెస్‌ పార్టీ పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంది.. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ – టీడీపీ ప్రత్యేక హోదా అంశంతో రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకున్నాయి.. పెద్దగా తేడా ఏమీ లేదు.