మూడు భాషల్లో ఏంజెల్

తొలి సినిమా తరువాత గ్యాప్ తీసుకుని, మాంచి సినిమాతో గట్టి ప్రయత్నం చేయాలని అప్ కమింగ్ హీరో నాగ్ అన్వేష్ చేస్తున్న సినిమా ఏంజెల్. రాజమౌళి శిష్యుడి డైరక్షన్ లో చేస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాను ఇప్పుడు మూడు భాషల్లో విడుదలకు రెడీ చేస్తున్నారు. సినిమాకు గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వర్క్స్ కాస్త పకడ్బందీగా చేయించడం, కథ కాస్త యూనివర్సల్ అప్పీల్ వున్నది కావడంతో తెలుగుతో పాటు తమిళ్, హిందీ బాషల్లో విడుదలకు కాపీలు రెడీ చేసారు.

సుమారు పాతిక కోట్లకు ఫైగా భారీ వ్యయంతో కొడుకును హీరోగా నిలబెట్టడం కోసం సీనియర్ నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి ఈ సినిమాను నిర్మించారు. వివి వినాయక్ లాంటి పెద్ద దర్శకులు వెనకాల వుండి సలహా సూచనలు అందించారు. ఫస్ట్ కాపీ రెడీ అయిన తరువాత డిజిటిల్, శాటిలైట్ అమ్మకాల కోసం హిందీ, తమిళ్ బయ్యర్లకు చూపించినపుడు వచ్చిన రెస్పాన్స్ చూసి, నేరుగా ఆ భాషల్లో కూడా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.

నవంబర్ 3న విడుదలవుతున్న ఈ సినిమాలో నాగ్ అన్వేష్ సరసన హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించింది. కమెడియన్ కమ్ హీరో సప్తగిరి ఒక ఫుల్ లెంగ్త్ కమెడియన్ రోల్ చేసారు. ఈ సినిమాతో తన కొడుకు హీరోగా సెటిల్ అవుతాడని నిర్మాత కృష్ణారెడ్డి చాలా ఆశాభావంతో వున్నారు.