మోడీ బాబా: ఎదుటివారికోసం ఎడాపెడా నీతులే!

‘‘ఎరగక నమ్మిన వాళ్ల నెత్తికే చేతులు వస్తాయి

ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’’

ఎంత అద్భుతమైన జీవిత సత్యం ఇది. సినీ కవి అద్భుతంగా కాచివడపోసిన జీవితానుభవాన్ని ఇక్కడ రంగరించి చెప్పారు. ప్రస్తుత ప్రపంచంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కూడా ఇదే సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కి విలువలు ప్రవచించడం అంటే మహామోజు.. అలాంటి సందర్భం అందివచ్చినప్పుడు ఆయన ఎంచక్కా మోడీ బాబా అవతారం ఎత్తుతారు. చాలా మంచిగా సుద్దులు చెబుతారు. ఆహా.. మోడీజీ ఎంత మహిమాన్వితుడో కదా.. అని అందరూ చేతులెత్తి మొక్కేలాగా.. వ్యవహరిస్తారు. తనదాకా వచ్చేసరికి.. అంటే తన కార్యరంగం విషయానికి వచ్చేసరికి.. అలాంటి నీతులేవీ ఆయనకు గుర్తుకు రావు.

ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే మూడు వ్యవస్థల గురించి చర్చ జరిగినప్పుడు మోడీ.. న్యాయవ్యవస్థకు కూడా నీతులు చెప్పేశారు. ఏయే కోర్టులు బాగా పనిచేస్తున్నాయో.. నిగ్గు తేల్చడానికి ‘జస్టిస్ క్లాక్’ లు ఏర్పాటు చేయాలిట. ఇలాంటి ఏర్పాటు వల్ల కోర్టుల మధ్య పోటీ పెరుగుతుందిట. అయినా న్యాయమూర్తులు న్యాయం చేయడం ప్రధానమా? వేగంగా జడ్జిమెంట్ ఇచ్చేయడం ప్రధానమా? అనేది ఒక పెద్ద ప్రశ్న. ఆ సంగతి పక్కన పెడితే.. దేశంలో న్యాయవ్యవస్థలో జాప్యం చాలా ఎక్కువ ఉన్నదనే ఆరోపణలు చాలాకాలంగానే ఉన్నాయి. అలాంటప్పుడు మోడీ సూచన పరిగణించదగినదే. అయితే రాజకీయ వ్యవస్థ మాటేమిటి?

కోర్టులకు కూడా పనితీరును పుటం వేయడానికి క్లాక్ పెడతారు సరే.. రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల విషయంలో వారిని తూకం వేయడానికి, వారి పనితీరు అధ్యయనానికి, అధికారంలోకి వచ్చిన పార్టీలు చెప్పిన హామీలను నెరవేర్చారా? నెరవేర్చకపోతే వారికి పడవలసిన శిక్షఏమిటి? దానికి పరిహారం ఏమిటి? ఇలాంటి అంశాలను కూడా మోడీ ప్రవచిస్తే బాగుంటుంది.

జస్టిస్ క్లాక్ ల వల్ల కోర్టుల మధ్య పోటీ పెరుగుతుందని, అది చాలా మంచిదని.. మోడీ ఎలాగైతే నీతులు చెబుతున్నారో.. హామీలను తూకం వేసే ఏర్పాటు వస్తే గనుక.. రాజకీయ పార్టీల మధ్య కూడా పోటీ పెరుగుతుంది. వారు ఒళ్లు దగ్గర పెట్టుకుని హామీలు ఇచ్చే మంచి రోజులు వస్తాయి. ‘‘అయిదేళ్లు కాదు.. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తాం అంటూ మాటలు చెప్పి గెలిచిన తర్వాత.. ప్యాకేజీ అంటూ ముష్టి ప్రకటించే మోసపూరిత ధోరణలకు కాలం చెల్లుతుంది’’ ఇలాంటి ఏర్పాటును మోడీ సర్కారు చేయగలిగితే.. ఆయన ఇతరులకు చెప్పే నీతులకు అర్థముంటుంది.