రామోజీ ఆశీర్వాదం: పార్టీని పణంగా పెట్టడమా.?

ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావుని తెలుగుదేశం పార్టీకి ‘రాజగురువు’గా అభివర్ణిస్తారు కొందరు. చంద్రబాబుకైతే రామోజీరావు ఎంత చెబితే అంత. టీడీపీకి వెన్నుదన్నుగా వుండే ఆ రెండు మీడియా సంస్థల్లో ‘ఈనాడు’ ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! స్వర్గీయ ఎన్టీఆర్‌ వెన్నుపోటు ఎపిసోడ్‌లో ‘ఈనాడు’, చంద్రబాబు టీమ్‌కి అండదండగా నిలిచిన వైనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఇక, రామోజీరావుకీ – వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికీ మధ్య ‘వైరం’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వైఎస్‌ హయాంలో, రామోజీరావుని ‘ఇబ్బంది’ పెట్టేందుకు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ని వినియోగించిన తీరు అందరికీ తెల్సిందే. 2004 ఎన్నికల సమయంలో వైఎస్‌కి వ్యతిరేకంగా ఈనాడు వ్యవహరించిన తీరు అలాంటిది మరి. మీడియా సంస్థకి అధిపతి అయినా, రాజకీయంగా వ్యూహాలు రచించి, వాటిని టీడీపీ ద్వారా అమలు చేయగలరు కాబట్టే ఆయన్ని ‘రాజగురువు’గా అభివర్ణిస్తారంతా.

ఇప్పుడు, ఈక్వేషన్స్‌ మారాయి. రామోజీరావు ఏపీలో చంద్రబాబుకి మద్దతిస్తోంటే, తెలంగాణలో కేసీఆర్‌కి మద్దతిస్తున్నారు. కేంద్రంలో ఆయన మద్దతు బీజేపీకేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, వైఎస్‌ జగన్‌ పదే పదే రామోజీరావు ‘ఆశీర్వాదం’ తీసుకోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ‘ఏదో అనుకోకుండా’ ఒకటి రెండుసార్లు రామోజీతో జగన్‌ ‘కలయిక’ జరిగినా, తాజాగా జగన్‌, రామోజీరావుని కలిసి ‘ఆశీర్వాదం’ తీసుకోవడంతో పార్టీ శ్రేణులు కూడా విస్తుపోయాయి.

వాస్తవానికి ఈ కలయికని ముందు వైఎస్సార్సీపీ శ్రేణులు విశ్వసించలేదు. ఆ తర్వాత ‘కలయిక నిజమే’ అని తెలుసుకున్నాక మాత్రం, ‘ఏం సమాధానం చెప్పగలం.?’ అన్న అయోమయానికి గురయ్యాయి. జగన్‌ – రామోజీ కలయికపై మాట్లాడేందుకే వైఎస్సార్సీపీ నేతలు ఇప్పుడు పెదవి విప్పలేని పరిస్థితి. వైఎస్సార్‌ – రామోజీ మధ్య ‘వైరాన్ని’ మరచి, జగన్‌ ఎందుకు రామోజీ ప్రాపకం కోసం పాకులాడుతున్నారన్న చర్చ వైఎస్సార్సీపీ శ్రేణుల్లోనే జరుగుతోందంటే, ఈ విషయమై జగన్‌ తనను తాను ఎలా సమిర్థంచుకుంటారన్నది ఆసక్తికరమే.

ఒక్కటి మాత్రం నిజం.. పరిస్థితులు అనుకూలించనప్పుడు, వ్యూహాలు మార్చుకోవాలి. అలాగని, రామోజీని కలిసి జగన్‌ ఆశీర్వాదాలు పొందడమేంటట.? రామోజీ ఆశీర్వాదం కోసం పార్టీని జగన్‌ పణంగా పెడుతున్నారన్న విమర్శలూ ఆఫ్‌ ది రికార్డ్‌గా పార్టీ నుంచే బయటకొస్తున్నాయి. మీడియా పరంగా రామోజీ నుంచి తన పాదయాత్రకు జగన్‌ మద్దతు కోరి వుండవచ్చన్న కొందరు వైఎస్సార్సీపీ నేతల వాదన, వారి గుండెల్లోంచి ధైర్యంగా రావడంలేదంటేనే అసలు విషయం అర్థమవుతోందిక్కడ.

గతంలో రామోజీని కలవడం ద్వారా తనకు జరిగిన మేలు ఏంటి.? ఇప్పుడు తాజాగా రామోజీని కలవడం వల్ల తనకు జరిగే మేలు ఏంటి.? అన్న విషయాలపై జగన్‌ బేరీజు వేసుకుంటే, వైఎస్‌ – రామోజీ మధ్య వైరం గుర్తు చేసుకుంటే, సాక్షి – ఈనాడు మధ్య ఆధిపత్య పోరుని గుర్తు చేసుకుంటే జగన్‌, రామోజీని కలవగలరా.? ఛాన్సే లేదు.