రొమాన్స్‌కే ఫ్యాన్స్…అత్య‌ధిక వీక్ష‌ణ ఆ సినిమాలే

క‌రోనా ఎంత భ‌య‌పెడుతున్నా…ప్రేక్ష‌కుల మ‌న‌సు మాత్రం రొమాన్స్ వైపే అని రుజువైంది. దేశంలో క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఇంటి నుంచి క‌దిలే ప‌రిస్థితి లేదు. టైమ్‌పాస్ కోసం ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఎంట‌ర్‌టైన్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. స‌హ‌జంగా స‌మాజంలో రెండే రెండింటికి ప్ర‌జ‌లు ఎక్కువ ఆక‌ర్షితులవుతారు. ఆ రెండూ భ‌క్తి, ర‌క్తి. సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా వ్యూస్ ఆ రెండింటికే ఉంటాయి.

లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎక్కువ మంది రొమాంటిక్ సినిమాల‌ను వీక్షిస్తున్నారు. ప్రేమ క‌థాచిత్రాల‌కు ఎప్ప‌టికీ ఆద‌ర‌ణ ఉంటుంద‌ని మ‌రోసారి రుజువైంది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ప్రేమ క‌థా చిత్రాల‌ను చూసేందుకు ప్ర‌జ‌లు త‌మ లాక్‌డౌన్ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుంటున్నారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన 15 హాలీవుడ్‌, బాలీవుడ్ ప్రేమ క‌థా చిత్రాల‌ను చూసేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆ సినిమాల‌ను చూడ‌టం విశేషం. ఇంట‌ర్‌నెట్ న‌ట్టింటిలోకి రావ‌డం…ఈ స‌మ‌యంలో ఎంతో క‌లిసొచ్చింది.

ఇంట్లోనే వెబ్‌షోలు, సినిమాలను కుటుంబ స‌మేతంగా వీక్షిస్తూ కావాల్సినంత వినోదాన్ని, ఉల్లాసాన్ని పొందుతున్నారు. ఎవ‌ర్‌గ్రీన్ సినిమా అయిన దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే (షారుఖ్‌ఖాన్ కాజోల్) సినిమా మొద‌లుకుని 1960 నాటి సలీం, అనార్కలీల ప్రేమకథ చిత్రం మొఘల్ ఆజం, జబ్ వి మెట్ (కరీనాకపూర్, షాహిద్ కపూర్), మాసాన్ (విక్కీ కౌశల్, శ్వేతాత్రిపాఠి, రిచాచద్దా) బాలీవుడ్ సినిమాలు ఎక్కువ మంది వీక్షిస్తున్నారు.

ద షేప్ ఆఫ్ వాటర్ హాలివుడ్ అనే హాలీవుడ్ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత‌గా ఆద‌రించారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్రభుత్వ లాబోరేటరీలో పనిచేస్తున్న ఓ యువతి ప్రేమలో పడిన వైనంపై తీసిన ఆ సినిమా ఇప్ప‌టికీ కొత్త‌గా చూసిన‌ట్టే వుంటుంది. అందుకే ఆ సినిమాను ఎన్నిసార్లు చూసినా సినీ అభిమానుల‌కు త‌నివి తీర‌డం లేదు. అలాగే అమెరికా యువకుడు ఫ్రెంచ్ యువతితో రైల్లో ప్రేమలో పడిన వైనంపై తీసిన బిఫోర్ సన్ రైజ్ , బిఫోర్ సన్ సెట్, బిఫోర్ మిడ్ నైట్ సినిమాను ప్రజలు బాగా చూస్తున్నారు.

ఇలా అనేక ప్రేమ క‌థా చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రించ‌డాన్ని బ‌ట్టి మ‌న దేశ ప్ర‌జ‌లు ఎంత క‌ళా హృద‌యులో అర్థ‌మ‌వుతోంది. ప్రేమ‌కున్న ఆక‌ర్ష‌ణ‌, ప్యాష‌న్ అలాంటిది. ప్రేమ అనే రెండు అక్ష‌రాలు…మ‌నసుల‌ను ఎంత‌గా క‌ట్టి ప‌డేస్తుందో ఆ క‌థా వ‌స్తువుతో తీసిన సినిమాలు సాధించిన విజ‌యాలే చెబుతున్నాయి.

ప్ర‌స్తుతం లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్‌లో ప్రజలు అధికంగా చూస్తున్న టాప్ 15 రొమాంటిక్ చిత్రాల్లో బాలీవుడ్‌లో జబ్ వి మెట్ (కరీనాకపూర్, షాహిద్ కపూర్), మాసాన్ (విక్కీ కౌశల్, శ్వేతాత్రిపాఠి, రిచాచద్దా) చిత్రాల‌తో పాటు హాలీవుడ్‌కు సంబంధించి నైటింగ్ హిల్( జూలియా రాబర్ట్), ఏ స్టార్ ఈజ్ బోర్న్(బ్రాడ్ లీ కూపర్, లేడీ గాగా), కాసాబ్లాంకా (హుంఫ్రే బోగార్ట్, ఇంగ్రీడ్ బెర్గ్ మ్యాన్) త‌దిత‌ర ప్ర‌సిద్ధ ప్రేమ క‌థా చిత్రాలున్నాయి.