‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఇదో ‘కట్టు’ కథ.!

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏం చేసినా సంచలనమే. ఏ సినిమా తీయాలనుకున్నా, ఏ మాట మాట్లాడాలనుకున్నా, అందులో ఆయన ‘వివాదం’ కోరుకుంటారు. అదే ఆయన ప్రత్యేకత. వివాదాస్పద అంశాలే సినిమాలుగా ఎందుకు.? అన్న ప్రశ్నకు వర్మ, భలే చిత్రమైన సమాధానమిస్తారు. సమాధానం కాదు, సమాధానం చెబుతున్నట్లుగా కొన్ని ప్రశ్నల్ని సంధిస్తారాయన. ‘భక్తి సినిమాలూ, ఫ్యామిలీ సినిమాలు తీయమంటారా.?’ అని ఎదురు ప్రశ్నించారు వర్మ, వివాదాలెందుకని ప్రశ్నిస్తే. దటీజ్‌ రామ్‌గోపాల్‌ వర్మ.

భక్తి సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు తీయడం పాపమా.? ఈ ప్రశ్నకి వర్మ సమాధానం చెప్పాల్సి వుంటుంది. ఏ సినిమా తీయాలన్నది ఆయనిష్టం. అదే సమయంలో, ఇంకొకరి జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించాలనుకుంటే, దానికి కొన్ని లెక్కలుంటాయి. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరపాల్సి వుంటుంది. వర్మ మాత్రం, అలాంటి పనులు చేయనంటున్నాడు. పైగా, ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ కోసం ఎన్టీఆర్‌ ఇంట్లో పనిచేసిన పనిమనుషులు, డ్రైవర్‌తో చర్చించానని ఆయన చెబుతుండడం గమనార్హం.

ఎన్టీఆర్‌ అంటే ఆషామాషీ వ్యక్తి కాదు. ‘నాకు నచ్చిన కోణంలో.. నాకు నచ్చిన విషయాల్ని చూపిస్తా..’ అనడం కమర్షియల్‌ సినిమాల్లో కుదురుతుందేమోగానీ, జీవిత చరిత్రలకి కుదరదు కదా.! మొత్తంగా చూస్తే, ఇదేదో ‘కట్టుకథ’ అన్న అనుమానాలకు వర్మ స్వయంగా ఆస్కారం కల్పిస్తుండడం గమనార్హం. ఎన్టీఆర్‌ సినిమా విషయంలో వర్మ వైఎస్సార్సీపీ నేతలతో మంతనాలు జరుపుతుండడం చూస్తేనే, వర్మ ఏ తరహా సినిమా తీయబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు.

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా విషయమై వర్మకి టీడీపీ నేతలు ఉచిత సలహాలిస్తే, కౌంటర్లు ఇచ్చిన వర్మ, చంద్రబాబుని 420గా చూపించాలని వైఎస్సార్సీపీ నేతలు ఉచిత సలహాలిస్తోంటే మాత్రం కౌంటర్ ఇవ్వకపోవడం కొసమెరుపు.