లాక్ డౌన్ ఎఫెక్ట్: 200 కిమి దూరం నుండి కన్పిస్తున్న హిమాలయాలు

కరోనా వైరస్ ప్రపంచదేశాల ప్రజలందర్నీ ముప్పుతిప్పలు పెడుతున్నా, ప్రకృతికి మాత్రం ఎంతో మేలు చేస్తోంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో చాలా దేశాల్లో పరిశ్రమలకు తాళాలు పడ్డాయి, లాక్ డౌన్ ప్రకటించడంతో పొగలు కక్కే వాహనాలు షెడ్డులకే పరిమితమయ్యాయి. ఫలితంగా గాలిలో కాలుష్యం శాతం చాలా తగ్గింది.

వాయు కాలుష్యం కారణంగా ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం, ఇప్పుడు దాన్నంతట అదే మూసుకుపోతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారు. తాజాగా లాక్ డౌన్ కారణంగా మరో అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. భూతల స్వర్గంగా పిలవబడే హిమాలయ పర్వత శిఖర అందాలను చూడాలంటే హిమాచల్ ప్రదేశ్‌ దాకా వెళ్లాల్సిందే. అయితే లాక్ డౌన్ కారణంగా వాయుకాలుష్యం భారీగా తగ్గడంతో హిమచల్‌లో దులంధర్ పర్వత శిఖరం పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ నుంచే కనిపిస్తోంది. 3500 నుంచి 6000 మీటర్ల ఎత్తైన ఈ పర్వతాలను ఏకంగా 200 లేక 300 కిలోమిటీర్ల దూరం నుండి చూసి, జలంధర్ వాసులు ఆశ్చర్యానందాలకు లోనవుతున్నారు.

తమ ప్రాంతం నుంచే హిమాలయ పర్వత శిఖర అందాలు చూస్తే అదృష్టం దక్కుతుందని కలలో కూడా ఊహించలేదని చెబుతూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తున్నారు. భారత్‌తో పాటు చాలాదేశాల్లో కరోనా లాక్ డౌన్ మరికొన్ని రోజుల పాటు సాగనున్న నేపథ్యంలో ప్రకృతి వింతలు చూపిస్తుందో చూడాలి.