లీకులిచ్చారనే కక్షతోనే వేటు వేశారా?

చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికార్ల పట్ల అనుమానంతో మాత్రమే కాదు.. అసమంజసంగా అనాలోచితంగా వ్యవహరిస్తున్నదనే అభిప్రాయాలు సచివాలయంలో వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు సంబంధించి లీకులిచ్చారనే ఉద్దేశంతో సచివాలయంలోని ఇద్దరు అధికార్లపై చంద్రబాబు ప్రభుత్వం వేటు వేసింది. ఈ వ్యవహారం మొత్తం ఉద్యోగ వర్గాల్లోనే భయాందోళనలను రేకెత్తిస్తోంది. సచివాలయం నుంచి లీకులు ఏ రూపంలో అయినా జరిగే అవకాశం ఉంటుంది గానీ.. వేరే ఉద్దేశాలను అనుమానాలను మనసులో ఉంచుకుని, విచారణ పేరిట ఓ ప్రహసనం నడిపించి, తమకు కిట్టని అధికార్ల మీద సస్పెన్షన్ వేటు వేయడం అనుచితం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

చంద్రబాబు ప్రభుత్వం కొన్ని రోజుల కిందట ఓ దారుణమైన నిర్ణయానికి ప్రయత్నించింది. తాను అధికారంలోకి రాగానే ఉద్యోగుల పదవీ విరమణ కాలాన్ని 60 ఏళ్లకు పెంచి.. వారికి వరాన్ని ప్రసాదించినట్లు బిల్డప్ ఇచ్చిన చంద్రబాబునాయుడు… తన అసలు రూపాన్ని ఈ నిర్ణయంలో చూపించారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు 50ఏళ్లు దాటిన తర్వాత.. వారు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారో లేదో ఓసారి పరిశీలించి, వారి పనితీరు అసంతృప్తికరంగా ఉన్నట్లయితే.. అప్పుడే తొలగించేసేలా ఓ బిల్లును తయారుచేశారు. అంటే నామమాత్రంగా రిటైర్మెంటు 60 ఏళ్లకే ఉంటుంది గానీ.. 50 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఉద్యోగి మెడ మీద తొలగించేసే ప్రభుత్వాధికారం రూపంలో కత్తి వేలాడుతూ ఉంటుందన్నమాట. ప్రతి ఏడాది.. ఆయన పనిని సమీక్షిస్తూ కొనసాగించాలో లేదో ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉంటుందన్నమాట.
అంటే.. ప్రతి ఉద్యోగి కూడా 50ఏళ్లు దాటాక ప్రభుత్వానికి అణిగి మణిగి సేవలందిస్తూ వారిని ప్రసన్నం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలాంటి పరిస్థితికి శ్రీకారం చుడుతూ బిల్లును రూపొందించారు. ఈ డ్రాఫ్ట్ బిల్లు బయటకు లీకయింది. సాక్షి దినపత్రిక ప్రచురించడంతో రాష్ట్రం మొత్తం ఉద్యోగవర్గాలు గగ్గోలు పెట్టాయి. నానా గందరగోళం చెలరేగింది. బిల్లు సంగతి తాము కేబినెట్ నిర్ణయం తీసుకోకముందే బయటకు వెళ్లడం, అదికాస్తా రభస కావడంతో ప్రభుత్వానికి పరువు పోయింది.

అప్పటికప్పుడు ఆపద్ధర్మంగా ఏదో బుకాయించుకున్నప్పటికీ… తర్వాత.. ప్రభుత్వం ఈ పరువునష్టం ఎలా జరిగిందో విచారణ సాగించింది. డ్రాఫ్ట్ బిల్లు లీకవడానికి కారణం అని విచారణలో తేల్చి.. న్యాయశాఖలో సెక్షన్ ఆఫీసర్ తిమ్మప్పను కొన్ని రోజుల కిందట సస్పెండ్ చేశారు. తాజాగా ఇదే కేసుకు సంబంధించి జలవనరుల శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా ఉన్న వెంకట్రామిరెడ్డిపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు.

అయితే ఈ ఇద్దరు అధికార్ల విషయంలో.. వారు వైసీపీకి అనుకూలంగా ఉండే వ్యక్తులు అని, రాయలసీమకు చెందిన వారని.. ఇలా కొన్నిరకాల అనుమానాల్ని ఉద్యోగ సంఘాల్లోనే కొందరు వ్యక్తులు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారని, అందువల్లనే కక్ష పూరితంగా సస్పెన్షన్ నిర్ణయాలు తీసుకున్నారనే ప్రచారం కూడా సచివాలయ వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్రం మొత్తం ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకునే నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వం తప్పుకాదు గానీ.. ఆ విషయం బయటకు పొక్కినందుకు అకారణంగా ఇద్దరు అధికార్లకు ఆపాదించి వేటు వేయడం సబబేనా? అని పలువురు ఆశ్చర్యపోతున్నారు.