‘లెజెండ్‌’ – ఈ ‘సిత్రాలు’ అన్నీ ఇన్నీ కాదయా.!

‘లెజెండ్‌’ సినిమాకి నంది అవార్డు ఇవ్వడమేంటి.? సోషల్‌ మీడియాలో ఈ ప్రశ్న చుట్టూ జరుగుతున్న చర్చ, రచ్చ అంతా ఇంతాకాదు. సినీ పరిశ్రమలోనూ ఈ విషయమై చర్చ చాలా జోరుగా సాగుతోంది. బాలయ్యకు ఉత్తమ నటుడిగా అవార్డ్‌, సినిమాకి ఉత్తమ చిత్రంగా పురస్కారం, విలన్‌గా జగపతిబాబుకీ.. ఇలా చెప్పుకుంటూపోతే, ‘లెజెండ్‌’ సినిమాకి నందులు పోటెత్తాయ్‌ మరి.!

అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్నది చంద్రబాబు సర్కార్‌. ఎంతైనా బావమరిది కదా.. అందుకే, బావమరిది బాలయ్య సినిమా మీద చంద్రబాబు సర్కార్‌ ఎక్కడలేని మమకారం ప్రదర్శించేసింది. ఎమ్మెల్యే అయిన బాలయ్యను పక్కన పెట్టి, తన కుమారుడు లోకేష్‌ని అప్పటికప్పుడు ఎమ్మెల్సీని చేసి, మంత్రిపదవి కట్టబెట్టిన చంద్రబాబు, ఇదిగో బాలయ్యకి ఇలా న్యాయం చేశారనుకోవాలేమో.!

ఇక, ‘లెజెండ్‌’ సినిమా అప్పట్లో మంచి విజయమే సాధించింది. బాలయ్య కెరీర్‌లో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమా ఇది. కానీ, ‘లెజెండ్‌’ సినిమా సాధించిన విజయం కంటే, ఆ సినిమాకి జరిగిన ప్రచారమే ఎక్కువ. ఆ విజయం తాలూకు ‘కిక్కు’ని తగ్గించేలా ‘లెజెండ్‌’ సినిమాకి హడావిడి చేశారు. 100రోజులు, 200 రోజులే కాదు, 500, 1000 రోజుల రికార్డులంటూ జరిగిన హంగామా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడేమో, ‘లెజెండ్‌’ సినిమాకి నందులు పోటెత్తాయ్‌.

నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.. ఏపీ నంది పురస్కారాల మీద ‘బాలయ్య ముద్ర’ అనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. దానికి తగ్గట్టే, ఈ ‘నంది సిత్రాలు’ – అదీ ‘లెజెండ్‌’ సినిమాకి. అందుకే ఇంత రచ్చ జరుగుతోందిప్పుడు.

కొసమెరుపు: 2014లో ‘లెజెండ్’ తర్వాత, 2015, 2016 సంవత్సరాల్లో బాలయ్య హిట్ కొట్టలేదుగానీ, లేకపోతే ఈసారి నందులన్నీ బాలయ్యకే చెందేవేమో. 2017కి మళ్ళీ నందులన్నీ బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఖాతాలోకి, వీలైతే “పైసా వసూల్” ఖాతాలోకీ వెళ్ళిపోనున్నాయేమో! వడ్డించేవాడు మనోడైతే.. విస్తట్లో అద్భుతాలకు లోటేముంటుంది.?