వారికి కీర్తి వస్తుందని ఆయనలో భయం!

పాలన సవ్యంగా సాగుతున్నదంటే అందుకు ప్రధాన సూత్రంగా అధికారాల, బాధ్యతల, పనుల వికేంద్రీకరణ కీలక పాత్ర పోషిస్తుంది. లీడర్ అనే వాడు సక్సెస్ ఫుల్ అని ఎలా గుర్తింపు వస్తుందంటే.. తన పరోక్షంలో కూడా పని సవ్యంగా జరిగిపోయినప్పుడే. అంతే తప్ప.. కీలకమైన పనులు తన కిందివాళ్లు చేస్తే వారికి కూడా మంచిపేరు వచ్చేస్తుందేమో.. కాబట్టి అన్ని పనులూ తానే చేయాలని అనుకునే బాపతు కొందరు పనిమంతులు ఉంటారు. అలాంటి లక్షణం వారిలోని అభద్రత భావానికి చిహ్నం. ముఖ్యమంత్రి చంద్రబునాయుడు కూడా ఆ తరహాలో వ్యవహరిస్తున్నారు. ఆయన మాటల్లోనే ఇలాంటి భావన వ్యక్తమవుతోంది.

తెదేపా ‘ఇంటింటికీ..’ కార్యక్రమాన్ని నిర్వహించింది. నాయకులంతా కలిసి రాష్ట్రంలో కోటికి పైగా ఇళ్లను చుట్టేశారని వారిదగ్గర లెక్కలున్నాయి. ఆ నేపథ్యంలో అందరు ప్రజల సమస్యలను తెలుసుకున్నారట కూడా. వాటన్నిటినీ కంప్యూటరైజ్ చేయడం కూడా జరిగిందిట. మరి ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యల్లో ఏ శాఖకు చెందిన వాటిని ఆయా శాఖల మంత్రులు.. అయినంత వరకు పరిష్కరించేయొచ్చు కదా..! అక్కడే చిన్న మతలబు ఉంది.

చంద్రబాబు పార్టీ నేతల్తో మాట్లాడుతూ.. మీరు సమస్యలు అన్నీ టైపు చేయించి కంప్యూటరుకు ఎక్కించేశారు. ఇక భారం నా మీద పెట్టేశారు. ఇప్పుడు వాటన్నింటినీ నేను పరిష్కరించాలి.. అంటూ తన పనిభారాన్ని గురించి నవ్వుతూ ఆవేదన పంచుకున్నారు. రాష్ట్ర ప్రజలు చెప్పిన అన్ని సమస్యలనూ స్వయంగా ముఖ్యమంత్రి పరిష్కరించాలని అనుకోవడమే అర్థంలేని ఆలోచన.

‘‘వచ్చిన సమస్యలను మదింపు చేయించండి.. మీమీ శాఖలకు సంబంధించిన ఏసమస్య కూడా పెండింగులో ఉండడానికి వీల్లేదు’’ అని సింగిల్ లైన్ లో మంత్రుల్ని ఆయన పురమాయిస్తే అక్కడితో ఆయన బాధ్యత అయిపోతుంది. పని భారాన్ని పంచాలి. పనిలో వేగం పెంచాలి. అంతే తప్ప.. అన్ని సమస్యలూ తానే పరిష్కరించాలనుకుంటే, స్టడీ చేసి నిర్ణయం తీసుకోవాలంటే ఎలా? మంత్రులు ఎవరంతట వాళ్లు స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి ఉంటే.. వారికి ఎక్కడ కీర్తి వచ్చేస్తుందో అని చంద్రబాబు ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది. అలాంటి ధోరణి నాయకుడికి సరైనది కాదు. తన ప్రభుత్వంలో ప్రజలకు సత్వర ప్రయోజనాలు అందాలంటే అధికార వికేంద్రీకరణ తప్పనిసరి అని ఆయన తెలుసుకోవాలి.