‘విజిల్‌’ వేస్తున్న కమల్‌హాసన్‌

సినీ నటుడు కమల్‌హాసన్‌ ‘విజిల్‌’ వేశాడండోయ్‌. ఇది పొలిటికల్‌ ‘విజిల్‌’. ‘మైయమ్‌ విజిల్‌’ అంటూ ఓ మొబైల్‌ యాప్‌ని తన పుట్టినరోజు సందర్భంగా కమల్‌హాసన్‌ ప్రారంభించాడు. ఈ యాప్‌ ద్వారా, ఎవరైనా తాను స్థాపించబోయే రాజకీయ పార్టీకి సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని కమల్‌ చెప్పుకొచ్చాడు. సంక్షేమమే తమ పార్టీ ప్రధాన ధ్యేయమనీ, అవినీతిని అరికట్టడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వస్తున్నానని ఈ సందర్భంగా కమల్‌ ప్రకటించడం గమనార్హం.

అన్నట్టు, విజల్‌ అనగానే మన తెలుగునాట ‘ఈల పార్టీ’ అదేనండీ, ‘లోక్‌సత్తా’ గుర్తుకు రావడం ఖాయం. ఇప్పుడదే తరహాలో కమల్‌హాసన్‌, తమిళంలో ‘ఈల’ (విజిల్‌) మోగించనున్నాడన్నమాట. అయితే, తెలుగు రాజకీయాల్లో ‘ఈల పార్టీ’ లోక్‌సత్తా సాధించిందేమీ లేదు. ఓ సారి ఎన్నికల్లో ఓ ఎమ్మెల్యే సీటు మాత్రం దక్కింది. అదీ పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్‌ నారాయణ మాత్రమే గెలిచారు. ఆ తర్వాత క్రమక్రమంగా లోక్‌సత్తా తెరమరుగైపోయింది.

ఇక, కమల్‌ స్థాపించబోయే పార్టీ విషయానికొస్తే ముందుగా ఆయన జనంలోకి వెళతాడట. జనంలోకి వెళితేనే, జనం సమస్యలు తెలుస్తాయని చెప్పిన కమల్‌, త్వరలో తమిళనాడు అంతటా పర్యటించేందుకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేయనున్నట్లు చెప్పాడు. వీలైనంత ఎక్కువమందిని కలవడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటాననీ, వారి ఆశయాలకు అనుగుణంగా తన రాజకీయ పార్టీ రూపు దిద్దుకుంటుందని కమల్ చెబుతున్నాడు. ఇంతకీ, కమల్ జనంలోకి వెళ్ళేందుకు పాదయాత్ర చేస్తాడా.? బస్సు యాత్ర చేస్తాడా.? అన్నదానిపై మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

మొత్తమ్మీద, కమల్‌ హాసన్‌ తన పుట్టినరోజున రాజకీయాల్లో మరో ‘కీలకమైన’ అడుగు వేశాడన్నమాట. చూద్దాం.. కమల్‌ రాజకీయ ప్రయాణం ముందు ముందు ఎలా వుండబోతోందో.!

కొసమెరుపు: పొలిటికల్‌ గెటప్‌ కోసమేనేమో అన్నట్లుగా కమల్‌, సరికొత్త గెటప్‌లో దర్శనమిచ్చాడండోయ్‌.