వైఎస్‌ జగన్‌కి ఆ కాంట్రాక్ట్‌ దక్కి వుంటే..

రాజకీయాల్లో విమర్శలు సహజం. రాజకీయ నాయకుడన్నాక విమర్శలు చేయాల్సిందే. విమర్శలు చేయకపోతే తమ ఉనికిని కాపాడుకునేదెలా.? ఇలా తయారయ్యింది ఇప్పుడు రాజకీయం అంటే. సీనియర్‌ నేతలు, జూనియర్లు అన్న తేడాల్లేవు. ఎవరైనా ఒకటే. నోటికొచ్చింది మాట్లాడటం, అదే రాజకీయం అని మురిసిపోవడం.. ఇదీ తంతు.!

టీడీపీ నేత, పైగా మంత్రి కూడా అయిన దేవినేని ఉమామహేశ్వరరావు, పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ విషయమై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ‘సంచలన’ ఆరోపణలు చేసేశారు. పోలవరం కాంట్రాక్టు గనుక వైఎస్‌ జగన్‌కి దక్కి వుంటే, అసలు కాంగ్రెస్‌ పార్టీని ఆయన వీడేవారే కాదట. ఇదీ దేవినేని ఉమ ఆరోపణ. కామెడీకే పరాకాష్ట కదా.!

నిజానికి వైఎస్‌ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు ముందుకు కదిలింది. ఆ లెక్కన వైఎస్‌ తన కుమారుడికే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుని కట్టబెట్టాలనుకుంటే అది పెద్ద విషయమే కాదు. ఈ మాత్రం మినిమమ్‌ కామన్‌సెన్స్‌ కూడా లేని దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రి ఎలా అయ్యారట.? ఇదొక మిలియన్‌ డాలర్ల ప్రశ్న మరి.!

పోలవరం కాంట్రాక్ట్‌ విషయంలో గతంలో రాయపాటి సాంబశివరావుని విమర్శించిన టీడీపీ, ఇప్పుడాయన్ని అక్కున చేర్చుకుంది. మళ్ళీ ఇప్పుడేమో, కాంట్రాక్టర్‌ పనులు సరిగ్గా చెయ్యడంలేదంటూ చంద్రబాబు సర్కారే దుమ్మెత్తి పోస్తోంది. ‘అంతా మీ ఇష్టమేనా.?’ అంటూ కేంద్రం మొట్టికాయలేసినా, జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి చీమ కుట్టినట్లయినా లేదు. చీమూ నెత్తురూ వుంటే, జగన్‌ మీద విమర్శలు చేయడం కాదు.. కేంద్రాన్ని ప్రశ్నించగలగాలి.! ఇంకా నయ్యం, అంత సీనే టీడీపీకి వుంటే, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వచ్చేది.. పోలవరం ప్రాజెక్టుకి సరిపడా నిధులొచ్చేవి.!

అవసరమైన చోట చేతకానితనాన్ని ప్రదర్శించడం, అవసరం లేని చోట్ల ఓవరాక్షన్‌ చేయడం.. ఇదీ టీడీపీ రాజకీయం. జగన్‌ని విమర్శిస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా.? రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందా.? కేంద్రాన్ని నిలదీస్తే ఆ రెండూ జరుగుతాయా.? కామన్‌సెన్స్‌ వున్నోడికి ‘వాస్తవం’ అర్థమవుతుంది. కాదంటారా.!