వైఎస్‌ జగన్‌తో ఆమెకి పోలికా.?

పార్టీ ఫిరాయించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మంత్రి అవ్వాలనుకోవడం తప్పా.? ఎందుకు కాదు.! మామూలుగా అయితే, ఇదొక ‘నేరం’.! ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ఆ పార్టీకి వ్యతిరేకంగా మారి.. ఇంకో పార్టీలోకి జంప్‌ చేసి, మంత్రి అవ్వాలనుకోవడం నేరమే. రాజకీయాల్లో ఇది అనైతికమైన చర్య. పార్టీ ఫిరాయింపుల చట్టం సరిగ్గా అమలయితే, పార్టీ ఫిరాయించగానే ఎమ్మెల్యే పదవి పోతుంది. దురదృష్టవశాత్తూ చట్టాల్లో వున్న వెసులుబాట్లు.. అన్నిటికీ మించి, స్పీకర్‌ వ్యవస్థ అనుసరిస్తోన్న తీరు.. వెరసి అక్రమం కాస్తా సక్రమం అయ్యేందుకు ఆస్కారం కల్పిస్తున్నాయన్నది నిర్వివాదాంశం.

పార్టీ ఫిరాయించేసిందికాక, మంత్రి పదవి కోసమే పార్టీ మారుతున్నట్లు సహచరులతో చెప్పుకుని అడ్డంగా బుక్కయిపోయిన గిడ్డి ఈశ్వరి, పదవీ కాంక్ష విషయంలో వైఎస్‌ జగన్‌తో తనను తాను పోల్చేసుకున్నారు. ‘జగన్‌ ముఖ్యమంత్రి అవ్వాలనుకోవడం తప్పు కాదా.? నేను, మంత్రి అవ్వాలనుకోవడం తప్పా.?’ అని ప్రశ్నిస్తున్నారామె. జగన్‌ ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నది, తాను ప్రజా ప్రతినిథిగా ఎన్నికయిన పార్టీ నుంచి. గిడ్డి ఈశ్వరి మంత్రి అవ్వాలనుకుంటున్నది ఇంకో పార్టీ నుంచి. ఆ మాత్రం తేడా తెలియకుండానే ఆమె రాజకీయాల్లో ఎలా కొనసాగుతున్నారట.!

ఇక, తనకంటూ ఓ వ్యక్తిత్వమే లేదన్న విషయాన్ని ఆమె తన మాటల్లోనే బయటపెట్టేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌ ప్రకారమే టీడీపీపైనా, చంద్రబాబుపైనా గతంలో విమర్శలు చేశానన్నది గిడ్డి ఈశ్వరి వాదన. ఆ వ్యాఖ్యల అర్థమేంటి.? నైతిక విలువలు తుంగలో తొక్కేసి, వైఎస్సార్సీపీలో తన ప్రాపకం పెంచుకోవడం కోసం చంద్రబాబు మీద అడ్డదిడ్డమైన ఆరోపణలు చేశారనే కదా.! మరిప్పుడు ఆమె చేస్తున్నది టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదువుతున్నారనే కదా.!

పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారంతో పోల్చారు టీడీపీ అధినేత చంద్రబాబు.. మరి, ఏపీలో పార్టీ ఫిరాయించిన నేతలు, ఆ వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా.? విభేదిస్తారా.? గిడ్డి ఈశ్వరి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలిగితే.. ఆమె, ఎంచక్కా జగన్‌తో తనను తాను పోల్చేసుకోవచ్చు.!