వైసీపీ అసెంబ్లీలో వుండి వుంటే..

‘ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో వుండి వుంటే..’ అన్న చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది. కారణం, అమరావతిలో జరిగిన బోటు ప్రమాదమే. ఓ బోటు, అధికారుల ‘కళ్ళుగప్పి’ సుమారు 40 మందితో కృష్ణా నదిలో అటూ ఇటూ తిరిగే క్రమంలో మునిగిపోయింది. 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, అసెంబ్లీలో ప్రకటన చేసేశారు. ఇది మామూలు ‘తంతు’ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.

ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత మామూలుగా అయితే, ప్రతిపక్షం తనదైన స్టయిల్లో ప్రభుత్వంపై విరుచుకుపడాలి. నిజానికి, ప్రభుత్వ ప్రకటన కంటే ముందు ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటుంది. కానీ, ప్రతిపక్షం అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేయడంతో, అధికార పార్టీకి ఎలాంటి ఇబ్బందీ లేకుండా పోయింది. సింపుల్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేసేసి ఊరుకున్నారు. ‘బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నాం’ అనే మాట చంద్రబాబు నోట షరామామూలుగానే వచ్చేసింది.

ఇంతేనా.? 20 మంది ప్రాణాలు పోతే, ఇంత సింపుల్‌గా ప్రకటన చేసేయడమా.? అన్న ప్రశ్నల చర్చ జరగడం సహజమే. అది గోదావరి పుష్కరాల నాటి సంగతి. 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అదీ చంద్రబాబు ‘పబ్లిసిటీ యవ’ కారణంగా. ఆ ఘటనకు సంబంధించి విచారణ జరిగింది. బాధ్యులెవరో తేలలేదు. అప్పుడూ పోయినవి సామాన్యుల ప్రాణాలే. ఇప్పుడూ పోయినవి సామాన్యుల ప్రాణాలే. అది ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఇక్కడా ఎంతో కొంత ప్రభుత్వ నిర్లక్ష్యం కన్పించకుండా వుండదు.

ఏదిఏమైనా, ప్రతిపక్షం వైఎస్సార్సీపీ అసెంబ్లీలో లేకపోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్‌ టీమ్‌కి ఇంకోసారి భలేగా కలిసొచ్చిందన్నమాట.