వై హరీష్! వై నాట్ కేటీఆర్!!

కొడంగల్ లో అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక దాదాపుగా అనివార్యం. రేవంత్ రెడ్డి రాజీనామాను స్పీకరు ఆమోదించడం. ఎన్నికల సంఘం ఈ స్థానాన్ని ఖాళీగా నోటిఫై చేయడం అనే లాంఛనం మాత్రమే మిగిలి ఉంది. ఆ నియోజకవర్గం నుంచి ఎవరికి వారు ఇక తమ ఎన్నికల విజయప్రయత్నాలను ఆరంభించుకోవచ్చు. ఈ కొడంగల్ లో ఈసారి గులాబీ పతాకను రెపరెపలాడించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఈ విషయమై పార్టీలోని ముఖ్యనేతలతో ఇప్పటికే ఓసారి చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కొడంగల్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కించుకునేందుకు అవసరమైన వ్యూహరచన చేసే బాధ్యతను మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. అయితే ఈ నిర్ణయమే ఇప్పడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ‘కొడంగల్ విజయం’ అనే కష్టసాధ్యమైన పనికి కేసీఆర్ హరీష్ మీదనే ఎందుకు బాధ్యత పెట్టారు? కేటీఆర్ ను ఈ పనికి ఎందుకు ఎంచుకోలేదు? అనే ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నం అవుతున్నాయి.

మంత్రి కేటీఆర్ తెలంగాణలో ఇటీవలి కాలంలో వచ్చిన చాలా ఎన్నికల విషయంలో తానే ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హైదరాబాదు జీహెచ్ఎంసీని వందకు పైగా సీట్లతో గెలుచుకోవడం కూడా.. కేటీఆర్ చాతుర్యమే అని ఆయనకు కితాబులిచ్చి.. కేసీఆర్ మునిసిపల్ శాఖను కూడా ఆయనకే కట్టబెట్టారు. ఇలా కేటీఆర్ ఎన్నికల్లో ప్రతిభను చూపించుకుంటూ వచ్చారు. అయితే కొడంగల్ విషయానికి వస్తే.. కేటీఆర్ నుకాకుండా, హరీష్ ను ఎందుకు ఇక్కడ మాత్రం బరిలోకి దించినట్లు అనే చర్చ సాగుతోంది.

ఎంతచెడ్డా.. కొడంగల్ ఉప ఎన్నికలో పోరు అనేది.. తెరాస ఇదివరకు ఎదుర్కొన్న ఉప ఎన్నికల తరహాలో కాకుండా చాలా సీరియస్ గానే సాగుతుందనే మాట మాత్రం వాస్తవం. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పలుచోట్ల ఉప ఎన్నికలు వచ్చినా నల్లేరుపై బండినడక తరహాలోనే కేసీఆర్ సర్కారు వాటిని గెలుచుకుంటూ వచ్చింది. వాటిలో చాలావరకు కేటీఆర్ చాతుర్యం ఖాతాలోకి పోయాయి. సింగరేణి ఎన్నికలు కూడా ఎంపీ కవిత ఖాతాలోకి పోయాయి. అయితే క్లిష్టమైన, విజయం కష్టమైన కొడంగల్ ఎన్నిక వచ్చేసరికి బాధ్యత హరీష్ రావు బారిన పడింది.

అయినా హరీష్ వెంటనే రంగంలోకి దిగి మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ తదితరులతో భేటీలు.. టికెట్ ఆశిస్తున్న గుర్నాధరెడ్డితో భేటీ నిర్వహిస్తూ.. పనికి ఉపక్రమించేశారు. అయితే.. ఇక్కడ ఫలితం తేడావస్తే.. అది హరీష్ వైఫల్యం కిందికి వస్తుందా? అలాంటి మచ్చ తన కొడుకు మీద పడకుండా మాత్రమే… కేసీఆర్ బాధ్యతను హరీష్ మీద పెట్టారా అనేది రకరకాల సందేహాలకు తావిస్తోంది.