శత్రువు ముంగిట ఇలా సాగిలపడడమేనా?

రాజకీయం పుట్టినప్పుడు పుట్టినా ఎప్పటికీ నిత్య యవ్వనంగా కనిపించే సిద్ధాంతం ఇది. రాజకీయాల్లో శత్రుత్వాలు ఎన్నడూ అవసరాలకోసం ఉంటాయి. అలాగే స్నేహాలు కూడా అవసరం కోసం ఏర్పడుతుంటాయి. ఆ ‘అవసరాల’కు ‘సిద్ధాంతాలు’ అనే ఒక ముసుగు తగిలించి ఎవరికి వారు బతికిపోతూ ఉంటారు. అయితే రాజకీయాలకు అతీతమైన శత్రుత్వాలు కొన్ని ఉంటాయి.

అవి వ్యక్తిగత శత్రుత్వాలు.. రాజకీయాల్లో ఎంతటి ఘోరమైన అవసరాలు ఏర్పడినా.. ఆ శత్రుత్వాలకు ముగింపు ఉండదు. సాధారణంగా అలా జరుగుతూ ఉంటుంది. కానీ.. తాజా పరిస్థితుల్లో నల్లారి బ్రదర్స్ వ్యవహరించిన తీరు.. స్పందించిన వైనం.. ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. శత్రువు ముంగిట ఇలా సాగిలపడ్డారేమిటా? అని అనిపిస్తోంది.

నల్లారి వారి కుటుంబంతో నారా చంద్రబాబానాయుడు కు వైరం ఈనాటిది కాదు. చిత్తూరు జిల్లాలో నల్లారి కిరణ్ తండ్రి నల్లారి అమరనాధ్ రెడ్డితో తలపడిన చరిత్ర అప్పటి కాంగ్రెస్ నాయకుడు అయిన చంద్రబాబుది. అప్పట్లో మంత్రిగా ఉన్న అమర్ నాధ్ రెడ్డి మాట ధిక్కరించి… జిల్లా పరిషత్ ఎన్నికల్లో – తన అభ్యర్థిని గెలిపించుకుని ఆయన హవాకు దెబ్బకొట్టారు. ఆ తరం నుంచి వారి కుటుంబాల మధ్య పచ్చగడ్డి భగ్గుమనే వైరమే ఉంది. కనీసం పరస్పరం మాటలు కూడా లేని వైరం ఉండేది.

కిరణ్ కుమార్ స్పీకరు అయినప్పుడు.. సభా గౌరవ మర్యాదలను పాటిస్తూ.. అన్ని శాసనసభా పక్షాల నాయకులు కలసి.. స్పీకర్ ఛెయిర్ వరకు తీసుకెళ్లడానికి కూడా చంద్రబాబు వెంట రాలేదు. తన లోపలి వైరం కోసం.. మర్యాదలను కూడా చంద్రబాబు పాటించలేదు. అంతగా నల్లారి కుటుంబాన్ని వ్యతిరేకించారు.

అలాంటి చంద్రబాబు వద్దకు నల్లారి కిరణ్ సోదరుడు వెళ్లి.. రాజకీయ మనుగడకోసం.. తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటాం అంటూ బేరాలు మాట్లాడుకోవడం చిత్రంగా కనిపిస్తోంది.

మేం చేస్తున్న అభివృద్ధి పనులకు మరింత మంది మా వైపు ఎగబడి వస్తున్నారు… ఇదంతా రాష్ట్ర ప్రజలకు శుభ సంకేతం అంటూ చంద్రబాబునాయుడు తన గురించి తాను కీర్తించుకోవడానికి ఇది మరొక అవకాశం. భవిష్యత్తులో మరికొన్ని చురుకైన చేరికలు కూడా ఉంటాయని అనుకోవచ్చు. కానీ నల్లారి కుటుంబం తలొగ్గడం మాత్రం స్థానికంగా చిత్రంగా చెప్పుకుంటున్నారు.