శ్రీరెడ్డిపై జనాల ఫీలింగ్ మారిందిలే

శ్రీరెడ్డి.. శ్రీరెడ్డి.. కొన్ని రోజులుగా తెలుగు జనాల నోళ్లలో నానుతున్న పేరిది. తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన ఆరోపణలతో వెలుగులోకి వచ్చిందీ అమ్మాయి. ముందు ఆమె ఆరోపణలు చేసినపుడు జనాలు పెద్దగా పట్టించుకోలేదు. శేఖర్ కమ్ముల పేరు ధ్వనించేలా చేసిన ఆరోపణలతో ఆమె తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. దీనికి తోడు ఫేస్ బుక్‌లో ఆమె పెట్టే పోస్టుల తీరు కూడా చాలా అభ్యంతరకరంగా అనిపించింది చాలామందికి. ఇక ‘మా’ కార్యాలయం ముందు చేసిన అర్ధనగ్న నిరసనతో శ్రీరెడ్డి జనాల్ని బాగా ఇబ్బంది పెట్టేసింది. ఈ విషయంలో ఆమెను తిట్టని వాళ్లు లేరు. ఆ దశలో ఆమెతో చర్చా కార్యక్రమాలు పెట్టడానికి కూడా టీవీ ఛానెళ్లు భయపడ్డాయి.

కానీ గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి విషయంలో జనాల దృష్టికోణం నెమ్మదిగా మారుతోంది. సురేష్ బాబు తనయుడు అభిరామ్ తో ఉన్న ఫొటోలు బయటిపెట్టిన అనంతరం శ్రీరెడ్డికి మద్దతు లభిస్తోంది. ఈ పరిణామం ఇండస్ట్రీలో కలకలం రేపింది. అంతకుముందు శ్రీరెడ్డిని తిట్టిపోసి ఆమెపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వాళ్లు యు టర్న్ తీసుకుని ఆమె గురించి చిలక పలుకులు పలకడం.. ఆమెపై బ్యాన్ ఎత్తేయడంతో అందరి వేళ్లూ సినీ పరిశ్రమ వైపు తిరిగాయి. అక్కడి నుంచి శ్రీరెడ్డికి మద్దతు పెరిగింది. సురేష్ బాబు కుటుంబం నుంచి అసలు స్పందనే లేకపోగా.. శ్రీరెడ్డి మాత్రం పదులైన విమర్శలతో, ఆరోపణలతో టీవీ ఛానెళ్ల చర్చల్ని వేడెక్కిస్తోంది.

రామ్ గోపాల్ వర్మ అన్నట్లుగా ఇంతకుముందులాగా ఏది పడితే అది మాట్లాడకుండా శ్రీరెడ్డి ఇప్పుడు స్ట్రాటజిగ్గా వ్యవహరిస్తోంది. ఆమెకు మహిళా సంఘాల మద్దతు పెరిగింది. మరోవైపు ఇండస్ట్రీలోని చిన్న స్థాయి మహిళా నటులు.. జూనియర్ ఆర్టిస్టులు చాలామంది తమ గోడు వినిపించడానికి ముందుకొస్తున్నారు. మరోవైపు శ్రీరెడ్డి తల్లి మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ కూతురి గురించి వాపోవడం.. శ్రీరెడ్డి బోరున ఏడవడంతో ఆమెపై సానుభూతి వచ్చింది జనాలకు. మొత్తానికి నెమ్మదిగా పరిస్థితి శ్రీరెడ్డికి అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. సినీ పరిశ్రమపై తన పోరాటం కొనసాగుతుందని.. మరిన్ని బాగోతాలు బయటపెడతానని శ్రీరెడ్డి అంటున్న నేపథ్యంలో మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.