షాకింగ్: ఆ సినిమా కూడా వాయిదా

రజనీకాంత్ నటిస్తున్న 2.0 సినిమా వాయిదాపడిన విషయం తెలిసిందే. జనవరి 25న రావాల్సిన ఈ సినిమాను తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఏప్రిల్ 13న విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పుడీ సినిమాతో పాటు రజనీకాంత్ నటిస్తున్న కాలా సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది.

2.0 కంటే ముందే కాలాను విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే నవంబర్ చివరి నాటికి కాలా షూటింగ్ పూర్తయిపోతుంది. డిసెంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసి జనవరిలో సినిమాను థియేటర్లలోకి తీసుకురావొచ్చు. కానీ 2.0 కంటే ముందే మరో సినిమాను విడుదల చేయడం రజనీకి ఇష్టంలేదు. దీంతో కాలా కూడా వాయిదా పడింది.

కాలా సినిమా జనవరికి రావడంలేదని స్వయంగా ఆ మూవీ నిర్మాత, రజనీకాంత్ అల్లుడు ధనుష్ ప్రకటించాడు. 2.0విడుదలైన తర్వాత ఓ మంచి టైమ్ చూసి కాలాను థియేటర్లలోకి తీసుకొస్తామని చెబుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. వచ్చే ఏడాది జులైలో కాలా సినిమా థియేటర్లలోకి వస్తుంది.

పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాలా సినిమాను పొలిటికల్ గా వాడుకోవాలని భావిస్తున్నాడు రజనీ. అందుకే ఎన్నికల సమయానికి కాలాను విడుదల చేస్తే బాగుంటుందని ప్లాన్ చేస్తున్నాడు. అణగారిన తమిళ ప్రజల కోసం పోరాటం చేసే క్రమంలో మాఫియా డాన్ గా ఎదిగే కాలా పాత్రలో కనిపించబోతున్నాడు రజనీ.