సూపర్ స్టార్ ఆఫీసులో క్వారంటైన్ పేషెంట్లు

దేశంలో కరోనా కేసులు మూడు వేలు దాటాయి. అయితే వీరు కాకుండా కొన్ని వేల మంది విదేశాల నుంచి వచ్చినవాళ్లు క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే కరోనా కేసులు పెరుగుతుండడంతో దేశంలో అలజడి నెలకొంది. కరోనా రక్కసిపై పోరాడేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలందరూ తమ స్థాయిలో విరాళాలు ప్రకటించారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ రూ.25 కోట్ల భారీ విరాళం ప్రకటించగా ఖాన్ త్రయం పెద్దగా ఇచ్చింది ఏమీ లేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.

అయితే ‘కింగ్’ ఖాన్ షారుక్, కోవిద్ 19ను ఎదుర్కొనుందుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు సిద్ధమంటూ ప్రకటించారు. ప్రధాన మంత్రి సహాయ నిధికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇస్తున్నట్టు ప్రకటించిన షారుక్… వీటితో పాటు వివిధ సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నట్టు ప్రకటించారు. తన మీర్ ఫౌండేషన్ ద్వారా 50 వేల పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్‌తో పాటు ముంబైలోని 5500 మంది పేదలకు నిత్యావసరాలు సరఫరా చేస్తామని తెలిపారు.

తాజాగా కరోనా బాధితులను క్వారంటైన్ చేసేందుకు తమ ఆఫీస్‌ను వాడుకోవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆఫర్ ఇచ్చారు షారుక్. ఈ విషయాన్ని బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. చిన్నారులు, మహిళలు, వృద్ధులకు చికిత్స చేసేందుకు, తమ ఆఫీస్‌ స్పేస్‌ను వాడుకునేందుకు ఇచ్చిన షారుక్‌కి, గౌరీఖాన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. కరోనా కోసం వందల కోట్లు ఇచ్చారని వాట్సాప్‌లో తెగ ప్రచారం జరిగిన బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మాత్రం ఇప్పటిదాకా ఈ విషయంపై కనీసం స్పందించకపోవడం విశేషం.